Thu Dec 19 2024 18:48:23 GMT+0000 (Coordinated Universal Time)
జాతిరత్నాలకు ఇక తిరుగే లేదట
నలుగురు ఎమ్మెల్యేలు సేఫ్ జోన్ లో ఉన్నారు.. వచ్చే ఎన్నికల్లో తొలి జాబితాలో టిక్కెట్లు దక్కేది వీరేకనన్న టాక్ వినపడుతుంది
తెలంగాణా రాజకీయాల్లో జాతిరత్నాలు ఎవరంటే ఇప్పుడు టక్కున గుర్తుకొచ్చేది ఆ నలుగురు ఎమ్మెల్యేలే. మొయినాబాద్ ఫాంహౌస్ లో బీజేపీ బేరసారాలాడిందంటున్న నలుగురు ఎమ్మెల్యేలను రత్నాలుగా కేసీఆర్ అభివర్ణించడంతో వారికి సోషల్ మీడియాలో జాతిరత్నాలుగా ప్రశంసిస్తూ కొందరు, విమర్శిస్తూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. సరే ఇంతకీ ఈ ఎమ్మెల్యేలను నిజంగా కొనుగోలు చేయడానికి ప్రయత్నించారా? లేదా అదంతా డ్రామానా? అన్నది పక్కన పెడితే ఒకటి మాత్రం నిజం నలుగురు ఎమ్మెల్యేలు సేఫ్ జోన్ లో ఉన్నట్లే కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో తొలి జాబితాలో టిక్కెట్లు దక్కేది వీరేకనన్న కామెంట్స్ వినపడుతున్నాయి. నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్లను ప్రగతి భవన్ లో ఐదారు రోజులు పైగా ఉంచారు. వారి నుంచి అన్ని విషయాలు తెలుసుకున్నారు. దీంతో వారిపట్ల కేసీఆర్ కు మరింత వాత్సల్యం పెరిగిందని అంటున్నారు.
మహేందర్ రెడ్డికి సీటు గల్లంతే...
వికారాబాద్ జిల్లాలోని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లోకి జంప్ చేశారు. ఆయనకు సొంత పార్టీలోనే ప్రత్యర్థిగా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఉన్నారు. సీనియర్ నేత కావడంతో 2014లో ఆయనకు కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. 2018 ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. తాండూరు నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసేందుకు మహేందర్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు కొనుగోలు కేసు ఆయన ఆశలపై నీళ్లు చల్లిందనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో పైలట్ రోహిత్ రెడ్డికి ఖచ్చితంగా టిక్కెట్ దక్కుతుందని ఆయన అనుచరులు పండగ చేసుకుంటున్నారు. మహేందర్ రెడ్డి వర్గం మాత్రం నిరాశలో మునిగిపోయింది.
జూపల్లి జారుకుంటారా?
మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో బీరం హర్షవర్థన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆయన కూడా టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇక్కడ కూడా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టిక్కెట్ రేసులో పోటీ దారుగా ఉన్నారు. జూపల్లి తనకు టిక్కెట్ రాకపోతే పార్టీని వీడతానని కూడా హెచ్చరిక జారీ చేశారు. అయినా ఇప్పుడు ఫాం హౌస్ లో హర్షవర్థన్ రెడ్డిని బేరసారాలకు దిగడంతో ఆయనకు కూడా టిక్కెట్ కన్ఫర్మ్ అయిందని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు, బీరం హర్షవర్ధన్ రెడ్డికి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బీరంకు మరోసారి టిక్కెట్ ఖాయమయినట్లేనన్న టాక్ వినపడుతుంది.
పాపం.. పాయం..
పినపాకలో 2018 ఎన్నికల్లో గెలిచిన రేగా కాంతారావు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే. ఆయనకు పోటీదారుగా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయిన పాయం వెంకటేశ్వర్లు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. ఆయనకు కూడా ఈసారి పినపాక సీటు వచ్చే అవకాశం లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. పొంగులేటి తన సీటు కోసమే శ్రమిస్తున్నారు. ఫాంహౌస్ లో బేరసారాలు దెబ్బకు రేగా కాంతారావుకు వచ్చే ఎన్నికల్లో సీటు ఖరారయినట్లేనని చెబుతున్నారు. ఇప్పుడు పాపం.. పాయం రాజకీయ భవిష్యత్ ఏంటన్న చర్చ పార్టీలో జరుగుతుంది. మొత్తం మీద ఫామ్ హౌస్ దెబ్బకు జాతిరత్నాలకు సీటు ఢోకా లేదన్న కామెంట్స్ మాత్రం పార్టీలో బలంగా వినపడుతున్నాయి.
Next Story