Mon Dec 23 2024 14:31:03 GMT+0000 (Coordinated Universal Time)
జనం తిరగబడతారు.. పాత రోజులు కావు సోదరా?
ఈ నెల 7 నుంచి బడుల నుంచి ఆసుపత్రుల వరకూ మూతబడనున్నాయి. ఆర్టీసీ తప్ప దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు సమ్మెలోకి వెళుతున్నాయి
నిజంగా సమ్మె జిరిగితే ఉద్యోగులు నష్టపోతారా? లేదా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందా? ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్దమయ్యాయి. ఈ నెల 7వ తేదీ నుంచి బడుల నుంచి పెద్ద ఆసుపత్రుల వరకూ మూతబడనున్నాయి. ఆర్టీసీ తప్పించి దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు సమ్మెలోకి వెళుతున్నాయి. ఇది నిరవధిక బంద్ కాబట్టి ఎప్పుడు సమ్మె విరమణ అనేది చెప్పలేని పరిస్థిితి. అయితే ఉద్యోగుల డిమాండ్లపై ప్రజలు ఏమనుకుంటున్నారు. వారివి గొంతెమ్మ కోరికలా? న్యాయబద్ధమైన డిమాండ్లా? అన్న చర్చ జరుగుతుంది.
దశాబ్దాల కాలం నుంచి....
దాదాపు దశాబ్దాల కాలం నుంచి ఉద్యోగుల సమ్మె జరగలేదు. ఎప్పుడో ఎన్టీఆర్ హాయంలో సమ్మె జరిగింది. అప్పుడు ఒక వైపు వాదన మాత్రమే వినిపించేది. ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియా బలంగా విస్తరించి ఉంది. ఉద్యోగులు నెల జీతం ఎంత? వారి సంపాదనతో పాటు ఎవరు ఏం చేస్తున్నారన్నది క్లియర్ కట్ గా నిమిషాల్లో తెలిసిపోతుంది. హెచ్ఆర్ఏ కోసం పట్టుబడుతున్న ఉద్యోగుల్లో 99 శాతం మందికి సొంత ఇళ్లు ఉన్నాయని, వారికి ఎందుకు హెచ్ఆర్ఏ ఇవ్వాలన్న వాదన సోషల్ మీడియాలో బలంగా విన్సిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ అన్నా అని పిలుస్తుండటంతోనే అలుసుగా తీసుకున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
వేతనం పెరగడం లేదని....
నెలకు డెబ్భయి నుంచి లక్ష రూపాయల జీతం తీసుకుంటున్న ఉద్యోగులు కొత్త పీఆర్సీ ప్రకారం తమ వేతనం పెరగడం లేదని ఆవేదన చెందుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్లే సిప్పులు చూసుకోమని చెబుతోంది. కానీ తమకు బకాయీ ఉన్న ఐదు డీఏలను వేసి పెరిగిందనడమేంటని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఇవేం తెలియవు. డీఏలు, పీఆర్సీ, హెచ్ఆర్ఏ అంటూ దోచుకుతింటున్నారన్నది మాత్రం అర్థమయింది.
సమ్మెకు దిగితే...?
సీఎం వాహనం డ్రైవర్ నుంచి ఉన్నతాధికారులకు చెందిన వాహనాలు ఏడో తేదీ నుంచి సమ్మెకు వెళతారు. అయితే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సమ్మెలో పాల్గొంటే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదు. రోగులకు అందుబాటులో ఉండాల్సిన సమయంలో, కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో ఈ శాఖ సమ్మెకు దిగితే అభాసుపాలు కాకతప్పదు. ప్రజలే తిరగబడి వారి చేత సమ్మెను విరమింప చేస్తారు. ఇక సమ్మె కాలంలో కూడా జీతం ఇవ్వకూడదని, గతంలో మాదిరి సెలవుగా కూడా ప్రకటించవద్దని సోషల్ మీడియా ద్వారా అనేక మంది ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు. ఈరోజు జరిగే చర్చలలో పట్టు విడుపులు పోకుండా ఇటు ప్రభుత్వం, అటు ఉద్యోగ సంఘాలు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Next Story