Thu Dec 19 2024 14:39:42 GMT+0000 (Coordinated Universal Time)
గల్లా కుటుంబానికి గ్యాప్ వచ్చిందా?
గుంటూరు పార్లమెంటుకు గల్లా జయదేవ్ గెలిచారు. అయితే ఆయన పెద్దగా నియోజకవర్గంలో పర్యటించరు. ప్రజలకు దూరంగా ఉంటారు

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. రాజకీయాల్లో తలపండిన కుటుంబాలు సయితం టైం బాగోలేకపోతే వాటిని వదిలేసుకోవాలి.. ఇప్పుడు గల్లా కుటుంబం పరిస్థితి కూడా అలాగే ఉంది. గల్లా అరుణ కుమారి తాను రాజకీయాలకు ఇక దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. ఆయన కుమారుడు గల్లా జయదేవ్ ప్రస్తుతం టీడీపీ గుంటూరు ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ దక్కడం అనుమానంగానే కన్పిస్తుంది.
దశాబ్దాల పాటు...
గల్లా కుటుంబం రాజకీయాల్లో కొన్ని దశాబ్దాల పాటు చక్రం తిప్పింది. చిత్తూరు జిల్లాలో అయితే గల్లా అరుణ కుమారి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా హవా చలాయించారు. కానీ వచ్చే ఎన్నికలలో గల్లా కుటుంబం రాజకీయాలకు దూరమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. గల్లా కుటుంబానికి వ్యాపారాలున్నాయి. పారిశ్రామికవేత్తలుగా వారు రాణించారు. రాజకీయాల్లో అనేక విజయాలు సాధించినా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వారికి పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి.
జయదేవ్ ఎంపీగా ఉన్నా..
2014, 2019 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటుకు గల్లా జయదేవ్ గెలిచారు. అయితే ఆయన పెద్దగా నియోజకవర్గంలో పర్యటించరు. ప్రజలకు దూరంగా ఉంటారు. పార్టీ క్యాడర్ తో కూడా గల్లా జయదేవ్ కలివిడిగా ఉండరు. గడిచిన మూడేళ్ల కాలంలో అడపా దడపా తప్ప పెద్దగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నది లేదు. విదేశీ పర్యటనలు, వ్యాపారాలను చూసుకోవడంతోనే ఆయన ఎక్కువ కాలం గడుపుతారన్న టాక్ వినపడుతుంది. లోక్సభ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఆయన ఢిల్లీలో కనపడతారు దీంతో పార్టీ హైకమాండ్ కు గల్లా జయదేవ్ కు మధ్య గ్యాప్ బాగా వచ్చిందంటున్నారు.
తప్పించాలని....
దీంతో ఇటీవల గుంటూరు టీడీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో గల్లా జయదేవ్ కు టిక్కెట్ ఇవ్వవద్దని చంద్రబాబును కోరినట్లు తెలిసింది. ఆ ప్రభావం తమపై పడుతుందని వారు అధినేత వద్ద ఆందోళన చెందినట్లు సమాచారం. చంద్రబాబు కూడా గల్లా జయదేవ్ పనితీరును అంచనా వేస్తున్నారు. రాజధాని అమరావతి విషయంలోనూ జయదేవ్ స్పందన అంతంత మాత్రంగానే ఉంది. కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. అయితే ఆర్థికంగా బలమైన నేత కావడంతో వేరే చోట జయదేవ్ కు టిక్కెట్ ఇవ్వాలా? లేదా? అన్నది చంద్రబాబు ఆలోచిస్తున్నారని సమాచారం. గుంటూరు నుంచి మాత్రం గల్లా జయదేవ్ ను తప్పిస్తారన్నది మాత్రం వాస్తవం.
Next Story