ఇంటలిజెన్స్ వర్గాలు ఏమంటున్నాయంటే....?
గణేష్ ఉత్సవాలకు ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందా? నగరంపై ఉగ్రవాదులు పంజా విసరనున్నారా? అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వినాయక ఉత్సవాలు, బక్రీద్ పండుగలకు ఉగ్రకార్యకలాపాలు, అసాంఘిక శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందా?... అంటే అవుననే అంటున్నాయి కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు. దీంతో కనివిని ఎరుగని రీతిలో పోలిస్ శాఖ భద్రత ఏర్పాట్లు చేస్తోంది. చీమ చిటుక్కుమన్న ఇట్టే పసిగట్టేందుకు నగరం అంతటా డేగకన్నుతో వీక్షిస్తోంది. ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవాలు, బక్రీద్ పండుగలను నిర్వహించేందుకు సర్వశక్తులొడ్డుతున్నారు సిటి పోలిసులు.
11 రోజుల పాటు.....
బాగ్యనగరంలో వినాయక ఉత్సవాలంటేనే ఓ ప్రత్యేకత. అందులోను ప్రపంచం నగరం వైపు తొంగి చూస్తోంది. ఏకంగా 11 రోజుల పాటు సాగే వినాయక ఉత్సవాలకు పోలిసులు భారీ భద్రత మధ్య నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందన్న కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాల సమాచారంతో రాష్ట్ర పోలిస్ శాఖ ఒక్కాసారిగా అప్రమత్తమైంది. కనివిని ఎరుగని విధంగా ఈ ఏడాది భారి పోలిసు భద్రతను రంగంలోకి దించింది. నగరంతో పాటు ప్రదానంగా ఖైరతాబాద్ మహాగణపతి చెంతకు వచ్చే భక్తులు, స్థానికుల భద్రతే లక్ష్యంగా పోలీసు శాఖ నిఘా, భద్రతా చర్యలు తీసుకుంది.
రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ......
ఇప్పటికే గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, రాజకీయ పార్టీల నేతలు, మండపాల నిర్వహకులతో పోలిస్ శాఖ సమావేశాలు ఏర్పాటు చేసింది. గణేష్ ఉత్సవాల కోసం నగరం అంతటా 26వేల మంది పోలిసులు భద్రత విదులు నిర్వహిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి మూడింతలు భద్రతను పెంచింది పోలిస్ శాఖ. అలాగే మూడు పోలిస్ కమిషనరేట్ల పరిధిలో సైబారాబాద్ లో 6వేల మంది పోలీసులు, రాచకొండ కమిషనరేట్ లో 6వేల మంది పోలిసులతో గట్టి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఖైరతాబాద్ భారి గణేష్ విగ్రహం వద్ద 300 మంది పోలీసులతో రౌండ్ ది క్లాక్ సెక్యూరిటి అందుబాటులో ఉండనుంది. క్రైమ్ టీమ్, షీటీమ్స్, సిటి కమాండోస్, క్విక్ రియాక్షన్ టీంమ్స్, ఐడి పార్టీలు, క్రైం బృందాలు విధులు నిర్వహించనున్నారు. స్థానిక పోలీసుల సహాయంతో మఫ్టి పోలీసులు రంగంలోకి దిగనున్నారు. ఒక్క ఖైరతాబాద్ భారి గణనాదుని వద్ద మొత్తం 36 అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సెంట్రల్ జోన్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేయనున్నారు. ఖైరతాబాద్ గణేష్ వద్ద ఎమర్జెన్సీ ఎక్సిట్ తోపాటు బారికేడ్లతో భద్రతను నిర్వహిస్తున్నారు. మెత్తం మూడెంచల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు పోలిసులు.
అసాంఘిక శక్తులతో.....
గణేష్ ఉత్సవాల నిర్వహణతో పాటు నిమజ్జనం దాకా అవసరమైన పోలీసు సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. నగరంలోని వేల సంఖ్యలో ఉన్న మండపాలు, పరిసర ప్రాంతాల్లో పోలిసుల నిఘా ఏర్పాటు చేయనున్నారు. అనుమానిత వస్తువులు, అనుమానిత వ్యక్తులు వచ్చినా జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే 100కు సమాచారం ఇవ్వాలని సిటీ పోలిసులు సూచిస్తున్నారు. ఉత్సవాల సమయంలో అసాంఘిక శక్తులతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో పోలీసులు బాంబ్‌స్క్వాడ్ ద్వారా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వినాయకుడి వద్ద అంబులెన్స్, అగ్నిమాపక యంత్రం, తాగునీరు, విద్యుత్తు దీపాలు అందుబాటులో ఉండేలా జీహెచ్ఎంసీ, జలమండలి, ఫైర్ తదితర శాఖలతో సమన్వయం చేయనున్నారు అదికారులు. ఖైరతాబాద్ వినాయకుడి నుంచి నిమజ్జనం జరిగే క్రేన్ నంబరు 4వరకు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలిసులు.
ఒకేసారి రెండు పండుగలు......
ఇక నగరంలోని పాతబస్తీతో పాటు న్యూసిటీ వైపు పోలిసులు నిఘా పెంచారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు, అతి సమస్యాత్మక ప్రాంతాలతోపాటు సున్నితమైన ప్రాంతాలను పోలిసులు గుర్తించారు. నగరంలోని 60పోలిస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడిషీటర్లను బైండ్ ఓవర్ కేసులతో పాటు అసాంఘిక శక్తులపై దృష్టి కేంద్రీకరించారు. పీస్ కమిటిలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గణేష్ మండపాల వద్ద బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేపడుతున్నారు. ఈఏడాది వినాయక నిమజ్జనం ముందు రోజు బక్రీద్ పండుగ రావడంతో నగరంలో మతసామరస్యానికి ప్రతీకగా వరుస పండుగలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. భారీ గణేష్ ను దర్శించేందుకు వచ్చే భక్తులు మండపాల నిర్వహకులకు, పోలీసులు సూచించే సలహాలపై ప్రతిఒక్కరు సహకరించాలని ఖైరతాబాద్ గణేష్ నిర్వహకులు విజ్నప్తి చేస్తున్నారు. వేల సంఖ్యలో నగరంలో మండపాల ఏర్పాటు వినాయక విగ్రహాల ప్రతిష్టల నేపద్యంలో పోలిసులు జియో ట్యాగ్ ను అందుబాటులోకి తెచ్చారు.
జియో ట్యాగ్ ద్వారా.......
ఆన్ లైన్ విధానం ద్వారా అనుమతులిస్తూ అన్ని మండపాలపై జియో ట్యాగ్ తో అనుసందానం చేస్తూ నిఘాను పెంచారు. జియో ట్యాగ్ ద్వారా పోలిసులు ప్రత్యేక దృష్టి కేంద్రీక్రుతమయ్యే అవకాశం ఉంది. అలాగే రోజువారి విధుల్లో బాగంగా పోలిసులు చెక్ పాయింట్లను ఏర్పాటు చేసి గణేష్ ఉత్సవాల నిర్వహణ పరిశీలించనున్నారు. వేల సంఖ్యలో విగ్రహల ప్రతిష్టించనున్న నేపద్యంలో పోలిసులు ఉత్సవాలు సామూహిక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు.గణేష్ ఉత్సవాలు, బక్రీద్ వేడుకలు ఒకేసారి రావడంతో పోలిసులు కనీవినీఎరుగని విధంగా భద్రతను ఏర్పాటు చేశారు. నగరం అంతటా నిఘా నేత్రంతో ఉత్సవాలు నిర్విహిస్తున్నారు. ఎయిరల్ రూట్స్ తో పాటు అవసరమైతే గగన విహారంలో పోలిసులు భద్రతను విజువలైజేషన్ చేస్తున్నారు. మెుత్తం సిసి కేమారాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్ తోపాటుగా ప్రత్యేక అక్టోపస్ బృందాలు సైతం ఈఏడాది ఉత్సవాలకు అందుబాటులో ఉండనున్నాయి. ప్రశాంత వారణంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వినాయక చవితి వేడకలు నిర్వహించేందుకు సర్వశక్తులొడ్డుతున్నారు.