Mon Dec 23 2024 12:53:09 GMT+0000 (Coordinated Universal Time)
బాగానే చెడినట్లుందే
వైసీపీ అధినేత జగన్కు, ఎంపీ విజయసాయిరెడ్డికి మధ్య గ్యాప్ పెరిగినట్లే కనిపిస్తుంది
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జగన్ తర్వాత రెండో స్థానం అనుకున్నారు. ఇప్పుడు క్రమంగా పార్టీకి దూరంగా జరుగుతున్నట్లే కనిపిస్తుంది. గతకొద్ది రోజులుగా విజయసాయిరెడ్డి మౌనంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఏదో జరిగింది. జగన్కు, విజయసాయిరెడ్డిల మధ్య విభేదాలు పొడసూపాయన్న ప్రచారాన్ని నిజం చేస్తూ సాయిరెడ్డి వ్యవహారశైలి కూడా కొనసాగుతుంది. ఇటీవలే విజయసాయిరెడ్డి రాజ్యసభ పదవి రెన్యువల్ అయింది. తర్వాత క్రమంగా పార్టీ హైకమాండ్ ఆయనను దూరం పెడుతుందనిపిస్తుంది.
విశాఖ నుంచి మంగళగిరికి
తొలి మూడున్నరేళ్లు విజయసాయిరెడ్డి విశాఖ కేంద్రంగా పార్టీలో కొంత హల్చల్ చేశారు. అక్కడే ఒక ఫ్లాట్ కొనుక్కుని పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. అయితే ఏం జరిగిందో ఏమో.. ఉన్నట్లుండి విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి పదవి నుంచి జగన్ తప్పించారు. ఆయన స్థానంలో వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. ఆయనను పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతను చూసుకోవాలని జగన్ ఆదేశించినట్లు వార్తలొచ్చాయి. కొంతకాలానికి అది కూడా పీకేశారు. దీంతో విజయసాయిరెడ్డి ఢిల్లీ, హైదరాబాద్కే పరిమితయ్యారు. ఎక్కడా పార్టీలో యాక్టివ్ గా కనిపించడం లేదు. జగన్కు, విజయసాయిరెడ్డికి మధ్య గ్యాప్ వచ్చిందనడానికి విజయసాయిరెడ్డి యాక్టివ్ నెస్ ఒక ఉదాహరణంగా చెప్పాలి.
విమర్శలు లేకుండా...
అంతా బాగుంటే విజయసాయిరెడ్డి ఊరుకునే రకం కాదు. ప్రధానంగా చంద్రబాబును, లోకేష్ ను ఉతికి ఆరేస్తుంటారు. అలాంటిది వారిపై ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. అలాగే ఏ2 అంటూ చంద్రబాబు ప్రతి ప్రసంగంలో విజయసాయిరెడ్డికి చోటు కల్పించేవారు. కానీ కొన్నాళ్ల నుంచి చంద్రబాబు కూడా విజయసాయిరెడ్డి పేరు ఎత్తకుండా జగన్పై మాత్రమే విమర్శలు చేస్తుండటం కూడా క్యాడర్లో అనేక సందేహాలు కలుగుతున్నాయి. ఇటీవల వైసీపీ సోషల్ మీడియా కూడా విజయసాయిరెడ్డిపై విమర్శలు చేస్తుండటం చూస్తే బాగానే చెడిందని అనుకోవాల్సి ఉంటుంది. ఎక్కడా సాయిరెడ్డి కన్పించడమే మానేశారు. అంత యాక్టివ్గా ఉండే ఆయన దూరమవ్వడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. టీడీపీ అనుకూల మీడియాలోనూ సాయిరెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రావడం లేదు.
ఎవరు దూరం పెట్టారు?
తారకరత్న మరణం తర్వాత చంద్రబాబుతో కలసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడటం వంటి విషయాలు జగన్కు ఆగ్రహం తెప్పించాయని కొందరంటారు. కానీ అది ఫ్యామిలీలో జరిగిన విషాద ఘటన కాబట్టి జగన్ కూడా దానిని సీరియస్గా తీసుకుంటారని భావించలేం. కానీ అంతకు మించింది ఏందో జరిగింది. అదే బయటకు రావడం లేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే విజయసాయిరెడ్డిని పార్టీ దూరం పెట్టిందా? లేదా ఆయనే దూరం జరిగారా? అన్నది తెలియకపోయినా ఒకటి మాత్రం నిజం. పెద్ద గ్యాప్ ఉందన్నది వాస్తవం. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని జగన్ విజయసాయిరెడ్డిని దూరం పెట్టారా? లేక సాయిరెడ్డి వల్ల పార్టీ నష్టం జరుగుతుందని భావించి గ్యాప్ ను తానే చేసుకున్నారా? అన్నది మాత్రం బయటకు రావడం లేదు. మొత్తం మీద ఇద్దరి మధ్య గ్యాప్ ఎక్కువగానే ఉందన్నది మాత్రం జరుగుతున్న పరిణామలను బట్టి చెబుతుంది.
Next Story