Mon Dec 23 2024 03:10:53 GMT+0000 (Coordinated Universal Time)
సజ్జలదే అప్పర్ హ్యాండ్
అవును ఎవరు అవునన్నా కాదనకున్నా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు
అవును ఎవరు అవునన్నా కాదనకున్నా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నెంబరు 2 అని చెప్పకతప్పదు. గతంలో జగన్ తర్వాత పార్టీలో ఎవరు అన్న దానికి అనేక పేర్లు వినిపించేవి. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటి పేర్లు వినిపించేవి. ఇక భవిష్యత్ లో ఆ అవకాశాలు లేవన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది.
ఎవరో ఒకరి పైన....
జగన్ కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సిందే. అధికారులు చెప్పే లెక్కలు వినడానికి బాగున్నా అందులో వాస్తవాలు ఎంతో ఎవరం చెప్పలేని పరిస్థితి. వివిధి నియోజకవర్గాల నుంచి పార్టీ పరిస్థితిపై తనకు ఖచ్చితమైన సమాచారం అందాలంటే ఎవరో ఒకరిపై ఆధారపడక తప్పని పరిస్థితి. అందుకే గత కొన్నాళ్లుగా ముఖ్యమంత్రి జగన్ సజ్జల రామకృష్ణారెడ్డి పై ఆధారపడుతున్నారని చెప్పక తప్పదు.
కీలక నిర్ణయాల్లో....
సజ్జల బయట సమావేశాల్లో కన్పించకపోవచ్చు. కీలక నిర్ణయాల్లో మాత్రం ఆయన పాత్ర ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె విషయంలోనూ మంత్రుల కమిటీ ఉన్నా జగన్ అందులో సజ్జల రామకృష్ణారెడ్డిని ఇరికించి మరీ తన మనిషి అని చెప్పకనే చెప్పారు. ఉద్యోగుల సమ్మె విరమణ విషయంలో నిజంగానే సజ్జల బ్యాచ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. అందుకే జగన్ కంటే ముందు మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకూ సజ్జల దర్శనం చేసుకుంటారు.
మంత్రివర్గ విస్తరణలోనూ.....
ఇక మంత్రి వర్గ విస్తరణ అనేది పూర్తిగా ముఖ్యమంత్రి జగన్ ఇష్టం. ఆయన ఎవరితో సంప్రదించరు. సీనియర్ నేతలతో మాట్లాడరు. ఇక్కడ కూడా సజ్జల రామకృష్ణారెడ్డిపైనే జగన్ ఆధారపడినట్లు తెలిసింది. జగన్ చెప్పిన ప్రకారం సామాజిక సమీకరణాల ఆధారంగా జాబితాను సజ్జల రూపొందిస్తే ఫైనల్ గా జగన్ టిక్ పెట్టేస్తారు. జగన్ తాను అనుకున్న వారికే పదవులు ఇచ్చినా, అందులో సజ్జల సలహాలు, సూచనలు ఉన్నాయన్నది వాస్తవం. సో.. జగన్ ను ముంచినా తేల్చినా సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పక తప్పదు. అందుకే సజ్జల మొబైల్ ఫోన్ నిరంతరాయంగా గత రెండు రోజుల నుంచి మోగుతూనే ఉంది.
Next Story