Mon Dec 23 2024 17:37:02 GMT+0000 (Coordinated Universal Time)
బొమ్మిడాయల పులుసు.. రొయ్యల మసాలా
విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్విస్టర్ల సమ్మిట్ లో అతిధులకు రుచికరమైన భోజనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది
విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్విస్టర్ల సమ్మిట్ పై ఏపీ ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. బడా పారిశ్రామికవేత్తలు ఈ సమ్మిట్ కు హాజరుకావడంతో వారికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసింది. దాదాపు పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుండటంతో వారికి వసతి, భోజన సౌకర్యాలపై కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అడ్వాంటేజీ ఏపీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సమ్మిట్ కు అంబానీతో పాటు దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరుకావడంతో ఏపీ ప్రభుత్వ పెద్దల్లో ఉత్సాహం నెలకొంది. తొలి రోజు 11 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది.
నోరూరించే రుచులు...
తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామి లడ్డు ప్రసాదాన్ని వచ్చిన పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారు. అయితే పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆకట్టుకునేందుకు నోరూరించే వంటకాలను సిద్ధం చేశారు. వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందులో ఆంధ్ర వంటకాలను రుచి చూపించనున్నారు. వెజ్, నాన్ వెజ్ లలో ప్రసిద్ధిగాంచిన ఆంధ్రవంటకాలను పారిశ్రామికవేత్తలకు అందించనుంది. దేశ విదేశాల నుంచి వచ్చే అతిధుల కోసం రెండు రోజుల పాటు రెండు రకాల భోజనాలను అందుబాటులో ఉంచనున్నారు.
ఈరోజు విందులో...
తొలిరోజు మధ్యాహ్నం భోజనంలో బొమ్మిడాయిల పులుసు, గుంటూరు కోడి వేపుడు, రొయ్యల మసాలా, మటన్ కర్రీ, చికెన్ పలావ్ ను ఏర్పాటు చేశారు. వెజిటేరియన్ భోజనంలో ఉలవచారు, మష్రూం కర్రీ, కాప్పికం, ఆలూ గార్లిక్ ఫ్రై, క్యాబేజీ టోమాటో పప్పు, బీట్ రూట్ రసం, మజ్జిగ పులుసు, కాలిఫ్లవర్ ఆవకాయ, నెయ్యి, గుమ్మడి వడియాలు, ద్రాక్ష పండ్ల పచ్చడి, ఊరిన మిరపకాయలు ఉంచనున్నారు. ఇక స్వీట్స్ లో కట్ ఫ్రూట్స్, ఐస్ క్రీం, పేస్ట్రీ, కాలా జామూన్, జూన్, చంద్రకాంతలను అందుబాటులో ఉంచనున్నారు.
రేపటి భోజనంలో...
రెండో రోజు భోజనంలో రష్యన్ సలాడ్, వెజ్ సలాడ్, రుమాాలి రోటీ, బటర్ నాన్ ను ఉంచారు. నాన్ వెజ్ లో ఆంధ్ర చికెన్ కర్రీ, చైప ఫ్రై, గోంగూర రొయ్యల కూర, ఎగ్ మసాలా, మటన్ పలావ్‌ను ఉంచారు. ఇక వెజ్ విషయానికి వచ్చే సరికి బిర్యానీతో పాటు కరివేపాకు రైస్, కడాయ్ పన్నీర్, కారెట్ బీన్స్ కొబ్బరి ఫ్రై, వంకాయ మెంతి కూర ఉంటాయి. ఉదయం పూట టిఫిన్ కింద ఇడ్లీ, వడ, దోసె, టమాటా బాత్, హాట్ పొంగల్ ఉంటాయి. సాయంత్రం అతిధులకు స్నాక్స్ ను కూడా అందిస్తున్నారు. ఫ్లమ్ కేక్, డ్రై కేక్, వెజ్ బుల్లెట్స్, స్ప్రింగ్ రోల్స్‌ను ఉంచారు. మిర్చి బజ్జీల రుచిని కూడా విదేశాల అతిధులకు రుచి చూపించనున్నారు. ఇక అరకు కాఫీ రుచి ఎటూ ఉండనే ఉంది.
Next Story