Tue Dec 24 2024 00:07:10 GMT+0000 (Coordinated Universal Time)
ఎందుకంత జీతాలు... ఏమిటీ యాగీ?
ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. తమ జీతాలను పెంచాలంటూ సమ్మెకు రెడీ అయిపోతున్నారు
ప్రభుత్వ పాఠశాలకు పిల్లల్ని పంపాలంటే తల్లిదండ్రులు వెనుకడుతున్నారు. ఖర్చు భరించలేకున్నా అప్పులు చేసో, ఇంటి ఖర్చులు తగ్గించుకునో ప్రైవేటు స్కూళ్ళకే పంపుతున్నారు. మొత్తం చదువుతున్న పిల్లల్లో 20 శాతం మందే ప్రభుత్వ స్కూళ్ళ నుండి ఉన్నారు. మిగతా 80 శాతం ప్రైవేటు స్కూళ్ళనుండే. కారణం ఎవరు?
ఆసుపత్రికి....
ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళాలంటే జనం భయపడుతున్నారు. అప్పో, సప్పో చేసి ప్రైవేటు ఆస్పత్రులకే వెళ్తున్నారు. ఆర్ ఎం పిలతోనే చాలావరకు సరిపెట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టరు ఖాళీగా కూర్చుని సాయంత్రం ఇంటిదగ్గర క్లినిక్ లో బిజీ అవుతున్నారు. పి హెచ్ సి నుండి పెద్దాసుపత్రి వరకు ఇలానే ఉన్నాయి. చిల్లిగవ్వ లేని జనం గతిలేని పరిస్థితుల్లో మాత్రమే పెద్దాసుపత్రికి వెళుతున్నారు. కారణం ఏంటి?
లంచం లేనిదే?
ఏ కాగితం మీద ఏ సంతకం కావాలన్నా ఎంతో కొంత లంచం ఇచ్చుకోవాల్సిందే. ఎంత లంచం ఇచ్చినా అక్కడ పని జరుగుతుందని గ్యారంటీ లేదు. పని సంగతి ఎలా ఉన్నా కనీసం గౌరవం దక్కుతుంది అని గ్యారంటీ లేదు. అన్ని టేబుళ్ళ చుట్టూ తిరగాల్సిందే. చీత్కారాలు భరించాల్సిందే. సంతోషంగా ఏ ప్రభుత్వ కార్యాలయంలో పని చేయించుకుని బయట పడలేం. కారణం ఏంటి?
పోలీస్ స్టేషన్ లోనూ....
ఏ పోలీస్ స్టేషన్లోనూ గౌరవం దొరకదు. న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. అసలు పోలీసు అంటే రక్షకుడు అని మనకు అక్కడ రక్షణ ఉంటుందని నమ్మకం లేదు. ధైర్యంగా పోలీసు స్టేషన్ కు వెళ్ళలేం. ఎందువల్ల? ఎవరు కారణం? ఎవరి వైఫల్యం? ప్రభుత్వ వ్యవస్థలను ఇలా తయారు చేసి ఇంకా జీతాలు పెంచమంటూ ఈ గోలేంటి? వీళ్ళు చేసే పనికి, పుచ్చుకునే జీతానికి పొంతన ఉందా!?
-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్
Next Story