Sun Dec 22 2024 23:24:47 GMT+0000 (Coordinated Universal Time)
అయ్యో సమ్మె లేదా...? ఇప్పుడేం చేయాలి?
ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి మొగ్గు చూపింది. ఫలితంగా ఉద్యోగులు సమ్మెను విరమించారు.
ముఖ్యమంత్రి జగన్ అర్జంటుగా కుర్చీ దిగి వెళ్లిపోవాలని కోరుకోవడంలో తప్పులేదు. తమ వారు అధికారంలోకి రావాలని భావించడం కూడా నేరం కాదు. కానీ రాష్ట్రం నిత్యం రగిలిపోతుండటమే కావాల్సిదిగా కోరుకునే వారిని ఏమీ చేయలేం. జగన్ కు అన్ని కష్టాలు వచ్చి పడాలి. గుక్కతిప్పుకునే వీలు లేకుండా ఆయన ఉండాలి. అప్పుడే మనకు మనశ్శాంతి అన్నట్లు కొందరు పోకడ ఉంది. ఎవరో చెప్పాల్సిన పనిలేదు. పనిగట్టుకుని ఒక వర్గం మీడియా గత పది హేను రోజుల నుంచి చేస్తున్న హడావిడి చూస్తే ఇది అవునని అనిపించక మానదు.
ఏ ప్రభుత్వం ఉన్నా....
ఉద్యోగులు తమ డిమాండ్ల కోసం ఏ ప్రభుత్వం ఉన్నా ఆందోళన చేస్తారు. అది చంద్రబాబు అయినా, జగన్ అయినా వారికి అనసవరం. తమ జీతాలు పెరగడం, ప్రయోజనాలు పొందడమే వారి లక్ష్యం. అందుకోసం వారు వివిధ రకాల ఆందోళనకు దిగుతారు. అయితే ఏపీలో ఉద్యోగులు సమ్మె మొదలు పెట్టకముందే వారిని రెచ్చగొట్టేవిధంగా కథనాలను వండి వార్చారు. డిబేట్లు గంటలు గంటలు నడిపారు.
సమ్మె జరిగితే?
వారు కోరుకుంది సమ్మె జరగాలని. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తే పాలన స్థంభించి పోతుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా కొన్ని ఆగిపోతాయి. అసలే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర పరిస్థిితి మరింత దిగజారిపోతుంది. అప్పుడు జగన్ అన్ని రకాలుగా ఇబ్బందికి గురవుతారు. అందుకే ఆర్థిక పరిస్థితిపై అనేక కథనాలను ప్రచురించే అదే మీడియా ఉద్యోగులకు అన్యాయం అంటూ గగ్గోలు పెట్టింది. వారిని రెచ్చగొట్టేందుకే ఎక్కువ ప్రయత్నించింది.
చివరకు ఇలా....
కానీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి మొగ్గు చూపింది. ఫలితంగా ఉద్యోగులు సమ్మెను విరమించారు. చలో విజయవాడను చూసి జగన్ తగ్గాడని చెబుతుంది. ఏ రాజకీయ నేత అయినా తగ్గాల్సిన సమయంలో తగ్గాలి. లేకుంటే పొలిటికల్ లీడరే కాదు. ఇప్పుడు ఒక అడుగు వెనక్కు వెశాడని ఓటమి అనుకుంటే పొరపాటు. అది భవిష్యత్ లో విజయానికి బాట వేసుకోవడానికి అనుకోవచ్చు. మొత్తం మీద ఏపీలో సమ్మె విరమణతో అనేక మంది హతాశులయ్యారు. రాజకీయ పార్టీలు పక్కన పెడితే ముఖ్యంగా ఒక వర్గం మీడియా మాత్రం నీరసపడిందనే చెప్పాలి. అందులో ఏబీఎన్, టీవీ 5 ముందు వరసలో ఉంటాయి. ఈరోజు నుంచి వీరు ఉద్యోగ సంఘాల నేతల పోకడపై విరుచుకుపడతారు చూడండి.
Next Story