Sat Nov 23 2024 03:27:41 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పని అయిపోయినట్లేనా?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి. వీటితో పాటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి. పట్టభద్రుల స్థానాలతో పాటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈరోజుతో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటికే అనేక మంది తమ నామినేషన్లను దాఖలు చేశారు. మొత్తం 17 జిల్లాల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వస్తే ప్రకాశం - నెల్లూరు, - చిత్తూరు గ్రాడ్యుయేట్ స్థానంతో పాటు, కడప - అనంతపురం - కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గం, శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలూ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. జనసేన ఈ ఎన్నికకు దూరంగా ఉంది.
ఒంటరిగా బరిలోకి దిగి...
తెలుగుదేశం పార్టీ, బీజేపీ, వైసీపీలో ఒంటరిగానే బరిలోకి దిగాయి. అయితే ఈ ఎన్నికలకు ప్రభుత్వానికి రిఫరెండంగా చెప్పుకోవచ్చా? అంటే అదే అనుకోవాల్సి వస్తుంది. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన తర్వాత దాదాపు మూడు ప్రాంతాల్లో ఈ మూడు ఎన్నికలు జరుగుతున్నాయి. అంతకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పటికీ వాటి ఫలితాలు సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఎన్నికలకు ఏడాది ముందు జరిగే ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలు రిఫరెండం అని విపక్షాలు కూడా ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నాయి. నిజంగా జగన్ అనుకున్న మూడు రాజధానుల ప్లాన్ వర్క్ అవుట్ అయితే కనీసం ఉత్తరాంధ్ర, రాయలసీమలో అయినా వైసీపీ అభ్యర్థులు గెలవాల్సి ఉంటుంది. అమరావతినే రాజధానిగా అన్ని ప్రాంతాలు భావిస్తే ఈ ఎన్నికల్లో వైసీపీకి ఇబ్బందులు ఎదురవుతాయి.
ఎమ్మెల్యేలకు టాస్క్...
అందుకే అధికార పార్టీ ఎమ్మెల్యేలు శక్తికి మించి పోరాడుతున్నారు. ఎలాగైనా మూడు చోట్ల అభ్యర్థులను గెలిపించుకోవడం వైసీపీ ఎమ్మెల్యేలకు పరీక్షగా మారింది. ఇది ఒక పెద్ద టాస్క్ గా మారిందనే చెప్పాలి. నిజానికి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం తప్ప అభివృద్ధి శూన్యమని విపక్షాలు విమర్శిస్తున్నాయి. విపక్షాల విమర్శల్లో వాస్తవముంటే గ్రాడ్యుయేట్ ఓటర్లు అధికార పార్టీకి మద్దతివ్వరు. నిరుద్యోగంతో అల్లాడి పోతున్నప్పుడు తమకు ఉపయోగపడని పార్టీ వైపు మొగ్గు చూపరు. గ్రాడ్యుయేట్ ఎన్నికలంటే సాధారణ ఎన్నికల స్థాయిలోనే జరుగుతాయి.
మూడు ప్రాంతాల్లో...
అందుకే ఈ ఎన్నికలు ఇటు అధికార పక్షానికి, అటు విపక్షాలకు సవాల్ గా మారాయని చెప్పాలి. ఇక పొత్తులు లేకుండా మూడు పార్టీలూ బరిలోకి దిగడం కూడా ఎవరి సత్తా ఏంటో ఈ ఎన్నికలతో తేలిపోతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కూటములు లేకుండా సొంత పార్టీ అభ్యర్థులను గెలిపించుకోగలిగితే సాధారణ ఎన్నికలకు ముందు కొంత హైప్ వచ్చినట్లే అనుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మూడు రాజధానుల అంశాన్ని ఈ ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ తేకపోయినప్పటికీ ఖచ్చితంగా ఆ అంశాన్నే బేస్ చేసుకుని ఎన్నికలు జరిగాయని భావించాల్సి ఉంటుంది. మరి మార్చి 16న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అప్పుడు తేలుతుంది.. రానున్న సాధారణ ఎన్నికల్లో ఎవరికి అనుకూల వాతావరణం ఉందనేది కొంతైనా స్పష్టమవుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..!!
Next Story