Sat Nov 23 2024 05:30:46 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ జాగ్రత్త పడాల్సిందే
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నాలుగేళ్ల పాలన పూర్తయింది. ఆయన ఇప్పటి వరకూ జనంలోకి వెళ్లింది లేదు. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలిసినట్లు లేదు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తోనే ఆయన తాడేపల్లి నివాసంలో ఎక్కువ సమయం ఉంటున్నారు. కేవలం సంక్షేమ పథకాల కింద నిధులను విడుదల చేసే సమయంలోనే బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పాయి. ప్రధానంగా ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ జిల్లాల్లోనూ జగన్ కు పరిస్థితులకు అనుకూలంగా లేవన్నది ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమవుతుంది.
ఉత్తరాంధ్రలో...
అయితే చివరకు ఎన్నికల ఫలితాలు ఎలాగైనా ఉండవచ్చు. కానీ ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఏ రౌండ్ లోనూ వెనకబడలేదు. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జగన్ దెబ్బతీయడం ఖాయంగానే కనిపిస్తుంది. గత ఎన్నికల్లో విజయనగరంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. శ్రీకాకుళం జిల్లాలో రెండు, విశాఖ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకే గత ఎన్నికల్లో టీడీపీని జగన్ పరిమితం చేయగలిగారు. కానీ ఈసారి రివర్స్లో ఫలితాలు వచ్చే అవకాశముందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలయినా యువత ప్రధానంగా వ్యతిరేకతతో ఉందని అర్థమవుతుంది. నాలుగేళ్లుగా సంక్షేమాన్ని పట్టుకునే ఊగులాడటం, అభివృద్ధిని విస్మరించడం కూడా జగన్ పై వ్యతిరేకత పెరగడానికి కారణమని చెప్పక తప్పదు.
రాజధానిగా ప్రకటించుకున్నా...
పైగా విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారు. అయినా యువత మాత్రం ఫ్యాన్ పార్టీ వైపు చూడలేదు. మూడు రాజధానుల అంశంపైనే వచ్చే ఎన్నికలకు వెళ్లనున్న జగన్ కు ఈ ఎన్నికలు కొంత షాక్ ఇచ్చాయనే చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇందులో మరో కోణం కూడా లేకపోలేదు. గ్రాడ్యుయేట్ ఎన్నికలు కావడమే వైసీపీకి ఇబ్బందిగా మారిందంటున్నారు. సంక్షేమ పథకాలన్నీ పేదలకే అందుతుండటం, యువతకు ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాల బాట పట్టడం కూడా నెగిటివ్ గా మారింది. ఇటీవల గ్లోబల్ సమ్మిట్ ను విశాఖలో నిర్వహించి 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పినా గ్రాడ్యుయేట్లు వైసీపీ వైపు మొగ్గు చూపలేదంటే లోపం ఎక్కడుందనేది స్పష్టంగా అర్థమవుతుంది.
ఈ మూడు జిల్లాల్లోనూ...
ఇక తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన జిల్లాల్లోనూ పరిస్థితి అంతే. ఈ పరిధిలో జగన్ కు బలంగా ఉన్న చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలున్నాయి. నాటి ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో టీడీపీ ఒక్క స్థానమే గెలుచుకుంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ప్రకాశం జిల్లాలో నాలుగు స్థానాలు టీడీపీకి దక్కాయి. అయినా ఈ ప్రాంతంలో ఎదురుగాలి వీస్తున్నట్లు స్పష్టంగా అర్థమయింది. ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి తొలి రౌండ్ నుంచి ముందంజలో ఉన్నారు. యువతలో వ్యతిరేకత ఉందన్నది స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం ఐదు ఎమ్మెల్సీలకు గాను మూడింటిని వైసీపీ గెలుచుకున్నా రెండు ప్రధానమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలను అధికార వైసీపీ కోల్పోతే మాత్రం అందుకు కారణాలను జగన్ వెదకాల్సిందే. ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందే. జగన్ జాగ్రత్త పడాల్సిందే. లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవు.
Next Story