Mon Dec 23 2024 07:23:28 GMT+0000 (Coordinated Universal Time)
గ్రూపులే ఇక్కడ కొంపముంచుతున్నాయా?
గ్రూపు విభేదాలే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థిని ఓటమికి కారణమవుతున్నాయి. నాయకత్వం ప్రయత్నించినా ఎవరూ తగ్గడం లేదు
గ్రూపు విభేదాలే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థిని ఓటమి వైపునకు నెడుతున్నాయి. ఆధిపత్య పోరుతో చేజేతులా నియోజకవర్గాలను గతకొన్ని ఎన్నికల్లో టీడీపీ వాటిని కోల్పోతుంది. ఆ నియోజకవర్గాలను గుర్తించి అక్కడ నేతలను సమన్వయం చేయడానికి టీడీపీ అధినాయకత్వం చర్యలు ప్రారంభించింది. అందులో శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గం. రాజాం నియోజకవర్గానికి కొండ్రు మురళి పార్టీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో అక్కడ మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ టిక్కెట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
హ్యాట్రిక్ కోసం...
ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా కంభాల జోగులు రెండుసార్లు విజయం సాధించారు. హ్యాట్రిక్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండటంతో కొంత వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఈ వ్యతిరేకతను టీడీపీ సొమ్ము చేసుకోవాల్సి ఉంది. కానీ ఇక్కడ టీడీపీ గ్రూపు విభేదాలతో కొట్టుమిట్టాడుతుంది. కళా వెంకట్రావు వర్గం ఇక్కడ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని భావిస్తుంది. తొలి నుంచి అంతే. కళా వెంకట్రావు, ప్రతిభా భారతి, కొండ్రు మురళి ఇలా మూడు గ్రూపులు రాజాం నియోజకవర్గంలో ఏళ్లుగా తిష్ట వేసి ఉన్నాయి.
కొండ్రు కాంట్రావర్సీగా...
అయితే ఎవరూ ఎవరి విషయంలో తగ్గేదేలేదంటున్నారు. కొండ్రు మురళి కాంగ్రెస్ నుంచి తనతో వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని గత ఎన్నికల్లో కళా, కావలి వర్గాలు దెబ్బేశాయి. దీంతో 2019 ఎన్నికలలో టీడీపీ అధినాయకత్వం కాంగ్రెస్ నుంచి వచ్చిన కొండ్రుమురళికి టిక్కెట్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. 2019 ఎన్నికల తర్వాత కొండ్రు మురళి కొంత పార్టీకి దూరంగా ఉన్నారు. మూడు రాజధానుల విషయంలోనూ ఆయన కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. అయితే కొండ్రు మురళి పట్ల చంద్రబాబు పాజిటివ్ గా ఉన్నారని తెలుస్తోంది.
మూడు గ్రూపులను...
ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ లోకేష్ టీంలో ఉన్నారు. ఇటీవల జరిగిన మహానాడులోనూ ఆమె ప్రసంగం హైలెట్ గా నిలిచింది. తొడకొట్టి మరీ వైసీపీకి సవాల్ విసిరింది. దీంతో లోకేష్ కోటాలో గ్రీష్మకు టిక్కెట్ దక్కవచ్చనే ప్రచారం జరుగుతుంది. గ్రీష్మకు టిక్కెట్ దక్కినా ఇక్కడ కళా, కొండ్రు వర్గాలు మద్దతిచ్చే అవకాశం లేదు. అలాగే కొండ్రుకు టిక్కెట్ ఇచ్చినా ఈ రెండు వర్గాలు పనిచేయవు. దీంతో ఈ నియోజకవర్గంలో నేతల మధ్య సమన్వయం చంద్రబాబుకు సమస్యగా మారింది. ముగ్గురిని ఏకం చేయగలిగితే రాజాం టీడీపీ పరమయినట్లే. కానీ అది సాధ్యం కాదన్నది ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. మూడు ఎన్నికల్లో రాజాం టీడీపీ పరం కావడం లేదు. మరి ఈసారి ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.
Next Story