Fri Dec 20 2024 20:04:16 GMT+0000 (Coordinated Universal Time)
గుజరాత్ గజ.. గజ.. ఫేవరెట్ ఎవరు?
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. షెడ్యూల్ వెలువడలేదు కాని అక్కడ ఎన్నికల వాతావరణం వేడెక్కి నెలలు గడుస్తుంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇంకా షెడ్యూల్ వెలువడలేదు కాని అక్కడ ఎన్నికల వాతావరణం వేడెక్కి నెలలు గడుస్తుంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అక్కడ కాలు మోపేందుకు సిద్ధమవుతుంది. వాతావరణ పరిస్థితుల కారణంగా షెడ్యూల్ విడుదల చేయలేదని ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చినా ఇప్పటికే హీట్ ప్రారంభమయింది. గుజరాత్ లో కాంగ్రెస్ కాలు మోపి దశాబ్దాల కాలం పట్టింది. బీజేపీ మరోమారు అధికారాన్ని దక్కించుకోవడానికి శ్రమిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాని సొంత రాష్ట్రంలో కాలుమోపేందుకు ప్రయత్నిస్తుంది.
మూడు దశాబ్దాలుగా...
గుజరాత్ లో బీజేపీ దాదాపు మూడు దశాబ్దాలుగా అధికారంలో ఉంది. 1952 నుంచి ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ ఏడు సార్లు విజయం సాధించింది. అయితే ఆ తర్వాత అసలు తేడా కొట్టింది. గుజరాత్ లో నరేంద్ర మోదీ నాయకత్వంలో కాంగ్రెస్ కు తిరుగులేని దెబ్బతగిలింది. ఆయన 2014లో ప్రధాని పదవికి ఎంపికయినా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 91 మాత్రమే. అయితే 2017లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. బీజేపీ 99 సీట్లు గెలవగా, కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించింది.
బీజేపీ వీక్ అయినా...?
అంటే ఒకరకంగా బీజేపీకి గుజరాత్ లో కొంత నష్టం జరిగిందనే చెప్పాలి. అటువంటి పరిస్థితుల్లో మరోసారి జరగనున్న గుజరాత్ ఎన్నికలు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. గుజరాత్ బీజేపీలో సరైన నాయకత్వం లేదు. మోదీ, అమిత్ షాలే ఇప్పటికీ ఎప్పటికప్పుడు గుజరాత్ పార్టీ వ్యవహారాలను పట్టించుకుంటూ గాడిన పెడుతున్నారు. సొంత రాష్ట్రంలో పార్టీ బలహీనం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మోదీ గత కొద్ది రోజులుగా గుజరాత్ లో విస్తృత పర్యటనలు చేస్తుండటం కూడా అదే కారణం. గత ఎన్నికల్లో చచ్చీ చెడీ బయటపడ్డారు. ఈసారి అలా కాకూడదని మోదీ, అమిత్ షాలతో పాటు కేంద్ర మంత్రులు విస్తృతంగా గుజరాత్ పర్యటిస్తున్నారు. పార్టీ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్ కూడా...
మరోవైపు కాంగ్రెస్ కూడా ఇప్పుడు బలంగా లేదు. దానికి కూడా సరైన నాయకత్వం లేదు. 2017లో రాహుల్ చరిష్మా చూసి జనం ఓట్లేశారంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కూడా కొంత పనిచేసి ఉండవచ్చు. కానీ గడిచిన కొన్ని రోజులుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. అలాగే పాటీదార్ ఉద్యమనేత, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్ధిక్ పటేల్ పార్టీని వీడారు. మరోవైపు రాహుల్ భారత్ జోడో యాత్రలో ఉన్నారు. ఆయన మరికొద్ది నెలల పాటు యాత్రలోనే ఉండాల్సి వస్తుంది. యాత్రను వదిలి పూర్తిగా గుజరాత్ ఎన్నికలపై దృష్టి పెట్టలేని పరిస్థితి. మరోవైపు సోనియా ఆరోగ్యం సరిగా లేదు. మరోసారి ప్రియాంకపైనే గుజరాత్ ఎన్నికల ప్రచారం భారం పడనుంది. ఈ పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ చురుగ్గా తిరుగుతున్నారు. ఆప్ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని, కాంగ్రెస్ ఓట్లకు గండి పడుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే పంజాబ్ తరహా గుజరాత్ ఉండదు. మరి చివరకు ఫలితాలు ఎవరి వైపు మొగ్గు చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story