క్షిణిస్తున్న ఆరోగ్యం... వీలునామా రాసేసిన హార్ధిక్
పటేళ్లను ఓబీసీ కోటాలోకి చేర్చి, రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాడ్ చేస్తూ ఉద్యమం చేస్తున్న హార్ధిక్ పటేల్ తన వీలునామాను ప్రకటించారు. ఆ రిజర్వేషన్ల కోసం గత 10 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో తాను మరణిస్తే తన డబ్బు, ఆస్తి ఎవరికి చెందాలో ఆయన ప్రకటించారు. తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.50 వేలలో 20 వేలు తన తల్లిదండ్రులకు ఇవ్వాలని, మిగతావి తన స్వంత గ్రామంలో గోశాల నిర్మాణానికి వెచ్చించాలని తెలిపారు. ఇక కారు, ఇన్సురెన్స్ డబ్బులు, తన జీవిత చరిత్ర పుస్తకం(హూ టుక్ మై జాబ్)పై వచ్చే రాయల్టీని మూడు భాగాలుగా విభజించాలని రాశారు.
అమరుల కుటుంబాలకూ భాగం
అందులో 15 శాతం తన తల్లిదండ్రులకు, 15 శాతం సోదరికి, మిగతా 70 శాతం 2015లో జరిగిన్ పటేల్ ఉద్యమంలో అమరులైన 14 మంది కుటుంబాలకు ఇవ్వాలని రాశారు. దీంతో పాటు ఆయన తన కళ్లను కూడా దానం చేసినట్లు స్పష్టం చేశారు. మరో రెండు రోజుల దీక్ష కొనసాగితే ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మాట్లాడే పరిస్థితి కూడా ఉండదని, ఆయన ఇప్పుడు వీలునామా ప్రకటన చేసినట్లు హార్ధిక్ మద్దతుదారులు తెలిపారు.