ఆ మౌనం వెనుక... స్పష్టమైన చీలిక..!
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్, రాజమండ్రి జైలుకు తరలింపుపై ఆంధ్రప్రదేశ్ అట్టుకుడుతోంది. దివంగత ఎన్టీయార్ కుటుంబం నుంచి కూడా నిరసనలు పెల్లుబికాయి. కానీ నందమూరి హరికృష్ణ కుటుంబం నుంచి మాత్రం ఎలాంటి స్పందనా లేదు. ఇది చంద్రబాబు నాయుడి అభిమానులకు మింగుడు పడటం లేదు. తెలుగు అగ్ర హీరోల్లో ఒకరిగా నిలుస్తూ, మాస్ ఫాలోయింగ్ ఉన్న జూనియర్ ఎన్టీయార్... తన మేనత్త కుటుంబానికి అండగా మాట్లాడకపోవడంపై తెలుగుదేశం పార్టీలో ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ నిరాసక్తత
తమ్ముడి బాటలోనే కళ్యాణ్‌రామ్
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్, రాజమండ్రి జైలుకు తరలింపుపై ఆంధ్రప్రదేశ్ అట్టుకుడుతోంది. దివంగత ఎన్టీయార్ కుటుంబం నుంచి కూడా నిరసనలు పెల్లుబికాయి. కానీ నందమూరి హరికృష్ణ కుటుంబం నుంచి మాత్రం ఎలాంటి స్పందనా లేదు. ఇది చంద్రబాబు నాయుడి అభిమానులకు మింగుడు పడటం లేదు. తెలుగు అగ్ర హీరోల్లో ఒకరిగా నిలుస్తూ, మాస్ ఫాలోయింగ్ ఉన్న జూనియర్ ఎన్టీయార్... తన మేనత్త కుటుంబానికి అండగా మాట్లాడకపోవడంపై తెలుగుదేశం పార్టీలో ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గతంలో చంద్రబాబు ఇంటి స్త్రీలను అవమానించిన ఘటనలో కూడా జూనియర్ ఎన్టీయార్ ‘ఆడవాళ్లను కించపరచకూడద’ని ఓ జనరల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకానీ చంద్రబాబు కుటుంబానికి మద్దతు తెలియజేయలేదు.
చంద్రబాబు తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకున్న తర్వాత... మొదటిసారిగా ఇప్పుడు అత్యంత సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జూనియర్ తనకేమీ పట్టనట్లు వ్యవహరిన్నారు. హరికృష్ణ రెండో కొడుకు కళ్యాణ్‌రామ్ కూడా చంద్రబాబు అరెస్ట్.. తదనంతర పరిణామాలపై నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. దీని వెనుక బలమైన కారణాలే కనిపిస్తున్నాయి.
జూనియర్ ఎన్టీయార్ సినీ రంగ ప్రవేశం చేసిన తొలిరోజుల్లో నందమూరి కుటుంబం నుంచి ఆయనకు పెద్దగా ఆదరణ దక్కలేదు. సక్సెస్ఫుల్ హీరోగా తనను తాను రుజువు చేసుకున్న తర్వాత ఆయన్ను తమ కుటుంబ సభ్యునిగా గుర్తించడం ప్రారంభించాయి... నారా, నందమూరి కుటుంబాలు. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డిని నిలువరించడానికి చంద్రబాబు జూనియర్ ఎన్టీయార్‌ను వాడుకున్నారు. కాంగ్రెస్‌కు ధీటుగా యంగ్ టైగర్ ప్రచారం చేశారు. ఆయన వాగ్ధాటి, ఛరిష్మా తెలుగుదేశానికి ఓ స్టార్ క్యాంపెయినర్‌ను అందించాయి. తాతకు తగ్గ వారసుడని జనం కూడా అనుకున్నారు. అయినా వైఎస్ మళ్లీ రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ఆయన మరణించడం, తెలంగాణ రాష్ట్ర ప్రకటన... అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ను అల్లకల్లోలం చేశాయి. 2009 ఎన్నికల తర్వాత చంద్రబాబు, జూనియర్ ఎన్టీయార్ మధ్య గ్యాప్ వచ్చింది.
2014లో చంద్రబాబు మళ్లీ అధికారాన్ని సాధించారు. ఈ దఫా తన వారసుడిగా లోకేష్‌ను ప్రమోట్ చేశారు. హరికృష్ణ ఫ్యామిలీ పూర్తిగా సైడ్‌లైన్ అయిపోయింది. 1995 ఆగస్టు సంక్షోభంలో హరికృష్ణ చంద్రబాబును పూర్తిగా సపోర్ట్ చేశారు. చంద్రబాబుకు ప్రజల మద్దతు లభించడానికి ఇది కూడా ఓ కారణం. తాను ముఖ్యమంత్రి అయ్యాక బావమరిదికి మంత్రి పదవి కూడా ఇచ్చారు. పార్టీలో తన స్థానం సుస్థిరం అయ్యాక హరికృష్ణ ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది, మరో బావమరిది బాలకృష్ణ... చంద్రబాబు వియ్యంకుడు అయ్యాక, నారా కుటుంబానికి హరికృష్ణ అవసరం లేకుండా పోయింది.
ఈ పరిణామాలన్నీ హరికృష్ణ కుటుంబానికి కోపం తెప్పించాయి. తన తండ్రికీ, తనకూ కుటుంబంలో సీనియర్ ఎన్టీయార్ కుటుంబంలో ప్రాధాన్యం తగ్గడంపై జూనియర్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. అందుకే నారా కుటుంబానికి కూడా ఆయన దూరం జరిగారు. కళ్యాణ్ రామ్ కూడా తమ్ముడి బాటలోనే వెళ్తున్నారు. తమ పర్యటనల్లో జూనియర్ అభిమానులు ‘ఎన్టీయార్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేయడంపై చంద్రబాబు, లోకేష్ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్‌కు మద్దతుగా ఫ్లెక్సీలు వెలుస్తున్నప్పుడు, కాబోయే సీఎం అంటూ నందమూరి అభిమానులు జూనియర్‌ను సంబోధిస్తున్నప్పుడు ఎన్టీయార్ కూడా స్పందించడం లేదు. తనకు ఆప్తుడు కొడాలి నాని... చంద్రబాబు, లోకేష్‌ను అసభ్యపదజాలంతో దూషిస్తున్నా ఎన్టీయార్ వారించడం లేదు. ఇవన్నీ నారా చంద్రబాబునాయుడిపై ఎన్టీయార్‌కి ఉన్న కోపానికి నిదర్శనాలను ఆయన అభిమానులు పేర్కొంటున్నారు.
లోకేష్‌దే బాధ్యత
తెలుగుదేశం పార్టీకి వారసుడిగా చంద్రబాబు లోకేష్‌ను ప్రమోట్ చేస్తున్నారు. యువగళం పేరుతో మొదలైన పాదయాత్ర ఇప్పటి వరకూ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతోంది. ఓ రకంగా చెప్పాలంటే అది విజయవంతంగానే ముందుకు వెళ్తోంది. చంద్రబాబు జైల్లో ఉన్న సందర్భంలో పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత లోకేష్‌దే. రాబోయే ఎన్నికలు కూడా లోకేష్ సామర్ధ్యానికి లిట్మస్ టెస్ట్ లాంటివి. 2024లో తెలుగుదేశం గెలిస్తే... వారసుడిగా లోకేష్ విజయం సాధించినట్లే. ఆయన నాయకత్వానికి ఎదురు ఉండదు. కానీ ఫలితం తారుమారైతే... తెలుగుదేశంలో ఓ వర్గానికి జూనియర్ ఎన్టీయార్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తారు. ఇప్డుడు దూరం పెడుతున్న నందమూరి వారసులు కూడా జూనియర్ పంచన చేరుతారు. ఓ రకంగా చెప్పాలంటే లోకేష్‌కు జగనే కాదు... ఎన్టీయార్ కూడా ఓ ప్రత్యర్థే. నందమూరి కుటుంబంలో చీలిక మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఎలాంటి విపరిణామాలకు దారి తీస్తుందో... భవిష్యత్తులో తేలుతుంది.