Mon Dec 23 2024 08:31:09 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : విసుగుపుట్టిస్తున్న వర్షాలు...ఇంకా ఎన్ని రోజులు బాబూ?
తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి
తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొరలుతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రహదారులు వర్షాల ధాటికి కొట్టుకుపోయాయి. క్రమంగా ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహం పెరుగుతుంది. ప్రాజెక్టులు నిండుతుండటంతో తాగు, సాగునీటికి ఇబ్బందులుండవనేది అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సామాన్యులు మాత్రం ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అధికార యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
ఈ జిల్లాల్లో...
ప్రధానంగా పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విపత్తలు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణలోనూ...
ఇక తెలంగాణలోనూ నేడు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పది జిల్లాలకు అలెర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ తో పాటు కొన్ని జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. హైదరాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మల్కాజ్గిరి జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. దీంతో పాటు గంటలకు అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని కూడా తెలిపింది. రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద చేరకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.
Next Story