తెలంగాణ సర్కార్ కి హైకోర్టులో ఎదురుదెబ్బ
గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ లను నియమించడాన్ని సవాలు చేస్తూ గతంలో హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ లను నియామిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ను వెంటనే రద్దు చేయాలని పలు మండలాల సర్పంచ్ లు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సైతం నిర్వహించాలని పిటిషన్ తరపు న్యాయవాది రచనా రెడ్డి హైకోర్టును కోరారు. ఈ పిటీషన్ పై విచారించిన ధర్మాసనం... పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల కొనసాగింపు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంచేసింది. ఇప్పుడు ఉన్న గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ లే మూడు నెలలలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ లు మూడు నెలల వరకు కొనసాగవచ్చని, ఆ లోపు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని హైకోర్టు చెప్పింది.