Sun Mar 02 2025 22:08:50 GMT+0000 (Coordinated Universal Time)
Mohan Babu : పెదరాయుడు ఇంట్లో "పెద్ద పంచాయతీ"
సినీ యాక్టర్ మంచు మోహన్ బాబు కుటుంబంలో హైడ్రామా కొనసాగుతుంది.

సినీ యాక్టర్ మంచు మోహన్ బాబు కుటుంబంలో హైడ్రామా కొనసాగుతుంది. కుటుంబంలో విభేదాలు తలెత్తాయని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. మంచు మనోజ్ పై మోహన్ బాబు మనుషులు దాడి చేశారని డయల్ 100 నెంబర్ కు ఫోన్ కాల్ వచ్చింది. అదే సమయంలో మోహన్ బాబు ఇంటి నుంచి కూడా పోలీసులకు కాల్ వచ్చిందంటున్నారు. అయితే మంచు ఫ్యామిలీలో జరుగుతున్న ఈ పరిణామాలు ఆ కుటుంబాన్ని వీధికెక్కించాయి. మంచు మనోజ్ గాయపడి నిన్న ఆసుపత్రిలో చికిత్స కూడా చేయించుకున్నారు. వైద్యుల నివేదికలో మంచు మనోజ్ కు స్వల్ప గాయాలయ్యాయని కూడా తెలిసింది. పోలీసులు మాత్రం ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ ఆఫ్ ది రికార్డుగా వారు చెబుతన్నారు.
ఆస్తులకు సంబంధించివేనా?
మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలు ఆస్తికి సంబంధించినవేనన్న ప్రచారం జరుగుతుంది. తిరుపతిలోని విద్యాలయానికి సంబంధించిన ఆస్తుల వివాదమే గొడవలకు కారణమని చెబుతున్నారు. మోహన్ బాబు తన ఆస్తులను పంచి పెట్టినప్పటికీ తిరుపతిలో ఉన్న ఆయన యూనివర్సిటీకి సంబంధించిన పంపకాలు జరగలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మనోజ్ కు, మోహన్ బాబు మనుషులకు మధ్య గొడవలు జరిగినట్లు పెద్దయెత్తున నిన్నంతా ప్రచారం జరిగింది. కానీ మోహన్ బాబు టీం మాత్రం నిన్న ఈ మంచు కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, ఇంట్లో గొడవలు ఏమీ జరగలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ ప్రచారాన్ని నమ్మవద్దని, తప్పుడు వార్తలు ప్రచురించవద్దంటూ కోరింది.
గొడవలేంటి?
అయితే జరుగుతున్న పరిణామాలు మాత్రం జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో మాత్రం ఏదో గొడవ జరిగిందని మాత్రం అర్థమవుతుంది. మంచు మనోజ్ గాయాలు పాలు కావడంతో పాటు ఈరోజు తిరిగి 30 మంది బౌన్సర్లు అక్కడకు చేరుకుంటుండటం కూడా ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తుంది. దుబాయ్ లో ఉన్న మంచు విష్ణు మరికాసేపట్లో హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో ఈ గొడవలు మరింత పెరుగుతాయని అంటున్నారు. మోహన్ బాబు బయటకు వచ్చి దీనిపై వివరణ ఇస్తే తప్ప నిజనిజాలు తెలియకపోయినా, కోరికలే గుర్రాలయితే అంటూ ఆయన కూడా నిన్న చేసిన ట్వీట్ ఇందుకు మరింత ఊతమిస్తుందని చెప్పుకోవాలి. మొత్తం మీద మోహన్ బాబు ఇంట్లో గొడవలంటూ రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారం అభిమానులకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికైనా మంచు కుటుంబంలో వాస్తవాలు బయటకు చెప్పాలని కోరుతున్నారు.
Next Story