Mon Nov 18 2024 06:32:47 GMT+0000 (Coordinated Universal Time)
రేపు హైదరాబాద్ లో అతిపెద్ద క్రైస్తవ వేడుక
రేపు అతిపెద్ద క్రైస్తవ వేడుకకు హైదరాబాద్ వేదిక కానుంది. పూల అంథోని కార్డినల్ అయిన వేళ ప్రత్యేక ప్రార్ధన జరగనుంది.
సెప్టెంబర్ 15న అతిపెద్ద క్రైస్తవ వేడుకకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ అగ్రపీఠానికి ఇద్దరు కార్డినళ్ళు, 15 మంది పీఠాధిపతులు, 500 మంది గురువులు హాజరు కానున్నారు. మహాఘన పూల అంథోని కార్డినల్ అయిన సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞత ప్రార్ధన జరగనుంది. ముంబాయి కార్డినల్ ఒస్వాల్డ్ గ్రేసియస్ చేతుల మీదుగా మహోత్సవ ప్రధాన పూజ జరుగుతుంది. అట్టడుగు వర్గాల కోసం కార్డినల్ పూలఅంథోని పనిచేయనున్నారు . ఈ వేడుకలో కొత్తగా నియమితులైన కార్డినల్ పూలఅంథోనితో పాటు ముంబాయి కార్డినల్ ఒస్వాల్డ్ గ్రేసియస్, 15 మంది పీఠాదిపతులతో సహా 500 మంది గురువులు పాల్గొననున్నారు. సెంట్మరీస్ హైస్కూల్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కాబోయే మహోత్సవ ప్రధాన పూజలో వేలాదిమంది క్రైస్తవ, కథోలిక విశ్వాసులు పాల్గొననున్నారు.
వాటికన్ లో జరిగిన వేడుకల్లో...
ఇటీవల ఆగస్టు 27న వాటికన్ నగరంలో జరిగిన వేడుకలలో పోప్ ఫ్రాన్సిస్ హైదరాబాద్ అగ్రపీఠాధిపతి మహాఘన పూల అంథోనిని కార్డినల్‌గా నియమించిన సంగతి విదితమే. ఈ సందర్భంగా కార్యక్రమ మీడియా కమిటీ కన్వీనర్ ఫాదర్ అల్లం ఆరోగ్యరెడ్డి మాట్లాడుతూ 2000 సంవత్సరాల తెలుగు క్రైస్తవ చరిత్రలో మొట్టమొదటి తెలుగు కార్డినల్‌గా పూల అంథోని నిలిచారని, ఆర్చిబిషప్ పూలఅంథోని కార్డినల్‌గా పదోన్నతి పొందిన సందర్భంగా కృతజ్ఞతా పూర్వకంగా పూజను నిర్విహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమములో ఆగ్రా, అగ్ర పీఠాధిపతి రఫేమాంజలి, భారతదేశం మరియు నేపాల్ యొక్క అపోస్తలిక్ మున్షియో మరియు వారి కార్యదర్శులు వికార్ జనరల్ గాబ్రియెల్ పెన్సే. బెర్హంపూర్ పీఠాదిపతి శరత్చంద్రనాయక్, బెంగుళూరు వికార్డజనరల్ సి. ఫ్రాన్సిస్, బల్లారి పీరాధిపతి హెన్రీ డినేజా హాజరుకానున్నారని తెలిపారు.
కర్నూలు జిల్లాకు చెందిన...
ఆంద్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన పీఠాధిపతి పూల అంథోని జనవరి 2021, హైదరాబాద్ అగ్ర పీఠాదిపతిగా అభిషేకింపబడి ఇప్పుడు కార్డినల్‌గా ఎదిగారు. ఇటీవల పోపుగారు ప్రపంచవ్యాప్తంగా 21 మందిని కొత్తగా కార్డినల్‌గా ప్రకటించగా వారిలో ఇద్దరు భారతదేశానికి చెందినవారు. వారిలో మొదటివారు పూల అంథోని కాగా రెండవవారు గోవా అగ్రపీఠాధిపతి ఫిలిప్నారి అంటోనియో. కార్డినల్‌గా నియమితులై రోమ్ నుండి తిరిగివచ్చిన తరువాత పూల అంథోని మాట్లాడుతూ ఇది కథోలిక్ సంఘానికి గర్వకారణమని, పోప్ ఫ్రాన్సిస్ గారి ఆదేశాల మేరకు పేదలకు మరియు అణగారిన ప్రజలకు సేవచేస్తానని తెలిపారు.
హైదరాబాద్ అగ్రపీఠానికి...
కార్డినల్ పూలఅంథోని ఫిబ్రవరి 1992 గురువుగా నియమితులై ఫిబ్రవరి 2008లో కర్నూలు పీఠాదిపతులుగా నియమితులయ్యారు. వారి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలుజిల్లా, చెందుకూరు గ్రామం. పూలఅంథోని కర్నూలు మైనర్ సెమినరీ, సెంట్ పీటర్స్ మేజర్ సెమినరి బెంగుళూరులో విద్యనభ్యసించినారు. ఆయన యూత్ కమిషన్ చైర్మన్ గా, ఆంద్రప్రదేశ్ సోషల్ సర్వీస్ సొసైటికార్యదర్శిగా తెలుగు కథోలిక పీఠాదిపతుల సమాఖ్య కోశాధికారిగా వివిధ హోదాలలో సేవలందించారు. పూలఅంథోని హైదరాబాద్ అగ్రపీఠానికి కార్డినల్ హోదాలో కొనసాగనున్నారు. దీనితో పాటుగా ఆయన ఆదిలాబాద్, కడప, ఖమ్మం, కర్నూలు, నల్గొండ మరియు వరంగల్ పీఠాలను పర్యవేక్షిస్తారు. ఈ కార్యక్రమ బాధ్యతలను హైదరాబాద్ అగ్రపీఠం యొక్క వికార్జనరల్ యెరువ బాలశౌరి మరియు ఛాన్సలర్, ప్రొక్యూరేటర్ విక్టర్ ఇమాన్యుయెల్ పర్యవేక్షిస్తారు.
Next Story