Mon Dec 23 2024 11:23:51 GMT+0000 (Coordinated Universal Time)
ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్స్ టీమ్ కు ఎంపికైన తెలంగాణ కుర్రాడు
అంతర్జాతీయ ఈవెంట్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు చాలా ఆనందంగా ఉందని.. నా తల్లిదండ్రుల మద్దతు..
హైదరాబాద్ కు చెందిన ఓ కుర్రాడు ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హైదరాబాద్ కు చెందిన లోకేష్ భారత్ కు చెందిన 3*3 టీమ్ లో సభ్యుడయ్యాడు. మే 14 నుండి 22 వరకు ఫ్రాన్స్‌లోని నార్మాండీలో జరగనున్న 19వ ప్రపంచ స్కూల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-స్కూల్ జిమ్నాసియాడ్ కోసం 16 ఏళ్ల లోకేష్ జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు. కేంద్రీయ విద్యాలయ, పికెట్స్ స్టూడెంట్ లోకేష్ తన అద్భుత ప్రదర్శనతో జట్టులోకి వచ్చాడు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS)లో జరిగిన SGFI నేషనల్ ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్‌లో తన సత్తా చాటాడు లోకేష్.
"అంతర్జాతీయ ఈవెంట్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు చాలా ఆనందంగా ఉందని.. నా తల్లిదండ్రుల మద్దతు, కృషి నా ఈ విజయానికి కారణమైంది" అని లోకేష్ తెలిపాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లోకేష్ తల్లిదండ్రులు అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ క్రీడాకారులే..! తన తల్లిదండ్రుల ఆటను చూసి లోకేష్ స్ఫూర్తి పొందాడు. "నా తల్లిదండ్రులు అంతర్జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారులు, వారు కలిసి ఆడటం నేను చూసేవాడిని. నేను నా ఆరవ తరగతిలో ఉన్నప్పుడు బాస్కెట్ బాల్ పై ఆసక్తి కలిగింది. అప్పటి నుండి నా శిక్షణ ప్రారంభించాను" అని 12వ తరగతి చదువుతున్న లోకేష్ తెలిపాడు.
2018 (కంగ్రా, హిమాచల్ ప్రదేశ్), 2019 (కటక్, ఒడిశా)లలో లోకేశ్ రెండుసార్లు సబ్-జూనియర్స్ నేషనల్స్‌లో తెలంగాణ రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించారు. అతను కేంద్రీయ విద్యాలయ స్కూల్ నేషనల్స్ పోటీలలో రజతం సాధించాడు. బెంగళూరులో జరిగిన SGFI నేషనల్స్‌లో కేంద్రీయ విద్యాలయ సంగతన్కు ప్రాతినిధ్యం వహించాడు. "నేను అంతర్జాతీయ ఈవెంట్లలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నాను. ప్రొఫెషనల్ లీగ్‌లు ఆడాలనుకుంటున్నాను. నా తల్లిదండ్రులు, దేశం గర్వించేలా చేయాలని కోరుకుంటున్నాను" అని లోకేశ్ చెప్పుకొచ్చాడు. లోకేష్ మారేడ్‌పల్లి జిహెచ్ఎంసి గ్రౌండ్‌లోని రైజింగ్ స్టార్స్ బాస్కెట్‌బాల్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.
తన కొడుకు ఎదుగుదల పట్ల తండ్రి విశాల్ ఎంతో గర్వపడుతున్నారు. ఆయన మాట్లాడుతూ "నేను గత 30 సంవత్సరాలుగా బాస్కెట్‌బాల్ ఆడుతున్నాను. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాను. ఇప్పుడు నా కుమారుడు నా వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. నా కొడుకు నా విద్యార్థుల్లో ఒకడు. ఒక తండ్రిగా, కోచ్‌గా డబుల్ ఆనందంగా ఉంది, "అని విశాల్ చెప్పారు.
Next Story