Mon Dec 23 2024 07:07:55 GMT+0000 (Coordinated Universal Time)
ఇక్కడ హైడ్రా... అక్కడ లడ్డూ... వీటి చుట్టూనే రాజకీయం
తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు, ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల లడ్డూ వివాదం రెండు ప్రభుత్వాలకు షీల్డ్‌గా మారాయి.
ఒక్కొక్క అంశం కొన్ని కీలకమైన అంశాలను మరుగున పడేలా చేస్తుంది. తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు, ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల లడ్డూ వివాదం రెండు ప్రభుత్వాలకు షీల్డ్‌గా మారాయి. ఒకరకంగా ఈ రెండింటిపైనే ప్రజల్లో చర్చ జరుగుతుంది. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తాము ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినా ఒకరు సెంటిమెంట్‌తో మరొకరు సుందరీకరణ పేరుతో ప్రధాన సమస్యలను మరుగు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే హాట్ టాపిక్ గా మారింది. ప్రజలు, రాజకీయ పార్టీలు అసలు సమస్యలను పక్కన పెట్టి వీటిపైనే ఫోకస్ పెట్టడంతో రెండు రాష్ట్రాల పాలకులు ఒకింత ఊపిరిపీల్చుకుంటున్నారు.
హైడ్రా కూల్చివేతలు...
తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు అందరినీ భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అయితే ప్రభుత్వం చేసేది మంచి పని కావడంతో కొంత మంది ప్రజలు హైడ్రా కూల్చివేతలను సమర్థిస్తున్నారు. కొన్నేళ్ల నుంచి చెరువులను, కాల్వలను, నాలాలను ఆక్రమించి భవనాలను నిర్మించుకుని ఎంజాయ్ చేస్తున్నారు. దీని వల్ల హైదరాబాద్ లో చిన్న పాటి వర్షానికి కూడా రహదారులు నీట మునిగిపోతున్నాయి. అలాగే మూసీ నది పరివాహక ప్రాంతంలోనూ అనేక అక్రమ కట్టడాలు వెలిశాయి. వరదలు వస్తే ఇబ్బంది పడేది అక్కడ ఉండే వారే. రాత్రికి రాత్రి వరదలు వచ్చి మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్లు నీటమునిగి అనేక మంది నష్టపోయారు.
మంచి పనే అయినా...
ఆక్రమణలను కూల్చివేసి మూసీనది సుందరీకరణ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. మూసీనది వెంట ఆక్రమణలను తొలగించి నిర్వాసితులకు డబుల్ బెడ్ రూంలు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు సర్వేలు కూడా చేపట్టింది. అది ఇబ్బందికరంగా మారింది. హైడ్రా ఎప్పుడు వచ్చి ఏ నిర్మాణాన్ని కూల్చివేస్తుందోనన్న టెన్షన్ అందరిలోనూ ఉంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తామని హైడ్రా చెబుతుంది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ కూడా కాంగ్రెస్ వేసిన ట్రాప్ లో పడింది. హైడ్రాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ కొందరిని దగ్గర చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మర్చిపోయినట్లయింది.
తిరుమల లడ్డూ వ్యవహారం...
ిఇక ఆంధ్రప్రదేశ్ లో తిరుమల లడ్డూ వ్యవహారం వివాదంగా మారింది. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడం, దానికి కౌంటర్ గా వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతుండటంతో పాటు ఎన్నికల్లో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు గాలిలోనే ఉన్నాయి. అది చాలు పాలకులకు. అసలు విషయం పక్కదారి పట్టి కొసరు విషయం మాత్రం హైలెట్ అవుతుంది. లడ్డూ వివాదంతో పాటు జగన్ తిరుమల పర్యటనకు వెళితే డిక్లరేషన్ పై కూడా పెద్దయెత్తున చర్చ జరిగింది. ఇలా పాలకులు బిందాస్ గా ఉన్నారు. అధికారపార్టీలు విసిరిన ట్రాప్ లో ప్రతిపక్షాలు పడినట్లే కనిపిస్తుంది. వాటిని డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పినప్పటికీ అసలు విషయాలు మాత్రం కనుమరుగు కావడం పాలకులకు కావాల్సిందదే. అందుకే రెండు రాష్ట్రాల్లో అధికారపార్టీ అనుకున్నది సాధించినట్లయింది.
Next Story