Thu Jan 16 2025 19:41:37 GMT+0000 (Coordinated Universal Time)
జేసీ బ్రదర్స్.. కొంచెం ఇష్టం.. కొంచెం నష్టం
తెలుగుదేశం పార్టీలో బాగా యాక్టివ్ గా ఎవరున్నారన్నారంటే.. జేసీ కుటుంబమనే విషయాన్ని అధినేత చంద్రబాబు సయితం అంగీకరిస్తారు
తెలుగుదేశం పార్టీలో బాగా యాక్టివ్ గా ఎవరున్నారన్నారంటే.. జేసీ కుటుంబమనే విషయాన్ని అధినేత చంద్రబాబు సయితం అంగీకరిస్తారు. వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే జేసీ బ్రదర్స్ యాక్టివ్ గా ఉన్నారు. పార్టీ కోసమో? లేదా తమ వ్యక్తిగత ప్రతిష్టను నిలుపుకోవడం కోసమో అన్నది పక్కన పెడితే తాడిపత్రిలో మాత్రం జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతల చేపట్టిన మరుసటి రోజు నుంచే అక్కడ టీడీపీ జెండా కనపడుతూనే ఉంది. తాడిపత్రిలో తమ ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం పచ్చ జెండాను పట్టుకుని ఉండవచ్చు. కానీ వచ్చే ఎన్నికల్లో జేసీ కుటుంబానికి కొంత ఇష్టం కలిగించే, మరికొంత నష్టం కలగించే నిర్ణయాలను చంద్రబాబు తీసుకున్నట్లు తెలియవచ్చింది.
పసుపు జెండా ఎగరేసి...
అంతెందుకు.. రాష్ట్రమంతటా మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హవా వీస్తే ఒక్క తాడిపత్రిలో మాత్రం టీడీపీ జెండా ఎగిరింది. అదీ జేసీ బ్రదర్స్ మూలంగానే. జేసీ బ్రదర్స్ పార్టీ కార్యక్రమాలకు కూడా పెద్దగా హాజరు కారు. చంద్రబాబుతో నిత్యం టచ్ లో ఉండరు. ఎందుకంటే ఎన్నికల్లో టిక్కెట్ కోసం వెంపర్లాడాల్సిన పని వారికి లేదు. వారినే పిలిచి టిక్కెట్ ఇచ్చేంత శక్తి ఆ కుటుంబానికి ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే వారు పార్టీ హైకమాండ్ ను కూడా పెద్దగా పట్టించుకోరు. వారి పనల్లా తమ నియోజకవర్గంలో సొంత డబ్బులు వెచ్చించి అయినా తమ అనుచరులను కాపాడుకోవాలి.
ఒకే టిక్కెట్ అనేది...
ఇప్పుడు కుటుంబంలో ఒకే టిక్కెట్ అనే విధానం కూడా జేసీ కుటుంబానికి వర్తించకపోవచ్చు. అలాగే నలభై శాతం యువతకే టిక్కెట్ల నినాదం కూడా తాడిపత్రిలో వినిపించకపోవచ్చు. పార్టీలో కొత్తగా వినిపిస్తున్న అంశం ఏంటంటే.. వచ్చే ఎన్నికలలో తాడిపత్రి నుంచి తిరిగి జేసీ ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. జేసీ అస్మిత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచాలని కోరినట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అయితేనే గెలుపు ఖాయమని చంద్రబాబు ముందు నివేదికలు స్పష్టం చేస్తున్నాయంటున్నారు.
ఇతర నియోజకవర్గాల్లో....
ఇక అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి మాత్రం జేసీ పవన్ రెడ్డికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవడంతోనే పవన్ రెడ్డికి అవకాశమివ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఇతర నియోజకవర్గాల్లో జేసీ కుటుంబం జోక్యాన్ని మాత్రం చంద్రబాబు లైట్ గా తీసుకుంటున్నారని తెలిసింది. పుట్టపర్తి, శింగనమల వంటి చోట జేసీ సిఫార్సులకు చెల్లుచీటేనని అంటున్నారు. అందుకే ఈ రెండు నియోజకవర్గాలకే వారిని పరిమితం చేస్తారని చెబుతున్నారు. మొత్తం మీద జేసీ కుటుంబంలో మాత్రం ఈసారి ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల విషయంలో చంద్రబాబు కొన్ని మార్పులు చేశారన్నది పార్టీ నుంచి వినిపిస్తున్న సమాచారం.
Next Story