Mon Dec 23 2024 13:56:33 GMT+0000 (Coordinated Universal Time)
Cyclone Update : 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, తుపానుపై సీఎం సమీక్ష.. నాలుగు విమాన సర్వీసులు రద్దు
మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా చూడాలని కోరారు. అన్నిశాఖల సమన్వయంతో పనిచేసి ప్రాణ, ఆస్తి నష్టం..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మాండూస్ తుపానుగా మారి, ఆ తుపాను తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ. ఏపీతో పాటు తమిళనాడులో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడులోని తిరువళ్లూరు, తంజావూరు, చెంగల్పట్టు జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. చెన్నై నుండి సింగపూర్, ముంబై వెళ్ళాల్సిన 11 విమానాల దారి మళ్లించారు. అలాగే తూత్తూకుడి, షిరిడీకి వెళ్లే నాలుగు విమానాలు రద్దు చేశారు. మాండూస్ తుఫాను కారణంగా సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎపీడీఆర్ఎఫ్ బృందాలు ఒంగోలుకు చేరుకున్నాయి.
ఇక ఏపీలో తుపాను పరిస్థితిపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మాండూస్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అలర్ట్ గా ఉండాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే పునరావాస కేంద్ర తరలింపుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు.
అలాగే రైతుల్లో కూడా ఈ తుపాను పట్ల అవగాహన కల్పించాలని, రైతు సహాయకారిగా ఉండాలని జగన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా చూడాలని కోరారు. అన్నిశాఖల సమన్వయంతో పనిచేసి ప్రాణ, ఆస్తి నష్టం కలగకండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. వర్షపాతం అధికంగా నమోదయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.
Next Story