Mon Dec 23 2024 11:03:53 GMT+0000 (Coordinated Universal Time)
జగనూ... పదవులు పంచావు గా.. ఇప్పుడు చూడు..?
దర్శి మున్సిపాలిటీ చిన్నదే కావచ్చు. అక్కడ టీడీపీ విజయం సామాన్యమైనది కాదు.
దర్శి మున్సిపాలిటీ చిన్నదే కావచ్చు. అక్కడ టీడీపీ విజయం సామాన్యమైనది కాదు. పన్నెండు మున్సిపాలిటీలో ఒక్క మున్సిపాలిటీ ఓడిపోతే ఏమిటన్న ఆలోచన చేయవచ్చు. కానీ ఇక్కడ రానున్న ఎన్నికలకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయని జగన్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికలలో దర్శి నియోజకవర్గం చేజారినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. నిజానికి ఇక్కడ టీడీపీకి పెద్దగా ఎవరూ నాయకులు లేరు. ఉన్న వాళ్లంతా వైసీపీలోనే ఉన్నారు. అదే ఇప్పుడు చిక్కయింది.
రెండు గ్రూపులుగా...
దర్శి నియోజకవర్గం వైసీపీలో ఎప్పటి నుంచో రెండు గ్రూపులున్నాయి. ఒకటి ఎమ్మెల్యే మద్ది శెట్టి వేణుగోపాల్ వర్గం కాగా, మరొకటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిది. 2019 ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే రెండు గ్రూపులుగా వైసీీపీ ఇక్కడ వర్థిల్లుతోంది. ఇద్దరిదీ వేర్వేరు దారులు. తమ అనుచరులకు ప్రయోజనం చేకూర్చాలని ఇద్దరూ తెగ పోటీ పడుతుంటారు. ప్రజలను మాత్రం పట్టించుకోరు.
జడ్పీ ఛైర్మన్ పదవి ఇచ్చినా...?
దర్శిలో విభేదాలు సమసిపోతాయని భావించిన జగన్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తల్లికి ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని కేటాయించారు. అయినా బూచేపల్లి తన ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. దర్శి మున్సిపల్ ఎన్నికలకు ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి జగన్ ప్రత్యేకంగా ఇక్కడ కాకాణి గోవర్ధన్ రెడ్డిని నియమించారు. ఆయన చేసిన ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు.
నేతలే లేని టీడీపీకి...?
దర్శి వైసీపీలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి శిద్దారాఘవరావు, కదిరి బాబూరావు వంటి నేతలున్నారు. టీడీపీకి ఇక్కడ పెద్దగా ఎవరూ లేరు. ఉన్న నేతల్లో కొద్దిగా నారపుశెట్టి పాపారావు ఒక్కరే కొంత పట్టున్న నేత. అయినా ఇక్కడ టీడీపీ గెలిచింది. ఇక్కడ టీడీపీ విజయం అని చెప్పే కన్నా, వైసీపీ చేతకాని తనం, కుమ్ములాటలే కొంప ముంచాయని చెప్పకతప్పదు. జగన్ పదవులిచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది.
Next Story