Fri Nov 15 2024 10:05:17 GMT+0000 (Coordinated Universal Time)
వేమిరెడ్డి వేగుగా మారారటగా?
నెల్లూరు జిల్లాలో వైసీపీలో గ్రూపుల గోల మామూలుగా లేదు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు అసలు పడటం లేదు.
నెల్లూరు జిల్లాలో ఇప్పుడు వైసీపీని ఎవరు శాసిస్తున్నారంటే ఒకరి పేరే వినపడుతుంది. జగన్ వద్ద నమ్మకంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నప్పటికీ ఆయనకు జగన్ ప్రత్యేక ప్రయారిటీ ఇస్తున్నారు. ఆయనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ కు జిల్లా రాజకీయాలపై ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తారని చెబుతున్నారు. ఆయనిచ్చే నివేదికల ఆధారంగానే జగన్ నిర్ణయం ఉంటుందన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తుంది.
గ్రూపుల గోలతో....
నెల్లూరు జిల్లాలో వైసీపీలో గ్రూపుల గోల మామూలుగా లేదు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు అసలు పడటం లేదు. ఒకరి నియోజకవర్గాల్లో మంత్రులు పర్యటించాలన్నా ఇష్టపడటం లేదు. ఎమ్మెల్యేలే తమ జిల్లా మంత్రులను నియోజకవర్గాలకు పిలిపించుకునేందుకు కూడా ఇష్టపడటం లేదు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలకు పడటం లేదు. అలాగే మేకపాటి గౌతమ్ రెడ్డిపై అసంతృప్తి లేకపోయినా ఇష్టం మాత్రం లేదు.
అసంతృప్తులతో...
దీంతో నెల్లూరులో వైసీపీ గ్రూపులతో కొట్టుమిట్టాడుతుంది. మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో జగన్ నేరుగా ఎమ్మెల్యేలతో మాట్లాడి సెట్ రైట్ చేయబట్టి అక్కడ విజయం సాధించింది. అదే రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ అవుతుందన్న నమ్మకం మాత్రం లేదు. ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి వంటి నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సయితం కంఫర్ట్ గా లేరన్నది వాస్తవం.
ఎమ్మెల్యేపై నెగిటివ్ రిపోర్ట్....
ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీలకంగా మారినట్లు తెలిసింది. జిల్లాలోని ఒక ఎమ్మెల్యేపై వేమిరెడ్డి నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారని తెలిసింది. ఆయన ప్రత్యర్థి పార్టీ నేతలతో కలివిడిగా ఉంటున్నారని, ఆయన వల్ల పార్టీకి ఇబ్బందులు తప్పవని వేమిరెడ్డి తన రిపోర్ట్ లో పేర్కొన్నట్లు తెలిసింది. ఆ ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ దక్కదన్న ప్రచారం జోరుగా సాగుతుంది. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ కు వేగుగా మారారన్న చర్చ పార్టీలో జరుగుతుంది.
Next Story