Mon Dec 23 2024 04:34:18 GMT+0000 (Coordinated Universal Time)
నోరూరించే "మహా" రుచులు
రాజమండ్రి మహానాడులో నోరూరించే వంటకాలను సిద్ధంచేశారు.
తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే ప్రతి కార్యకర్తకు పండగ వంటిది. నేతలతో నేరుగా కలిసే అవకాశం దక్కుతుంది. తమ అభిమాన నేతలను దగ్గర నుంచి చూసే వీలు కలుగుతుంది. అందుకే ప్రతి మహానాడుకు లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివస్తారు. ఇచ్ఛాపురం నుంచి అనంతపురం వరకూ, ఇటు తెలంగాణ నుంచి కూడా లక్షలాది మంది కార్యకర్తలు ఈ పండగను స్వయంగా చూడటం కోసం ఏడాదంతా నిరీక్షిస్తుంటారు. ఇక తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే నోరూరించే వంటకాలను ప్రతి కార్యకర్తకు కడుపునిండా పెట్టిపంపడం సంప్రదాయంగా వస్తుంది. ఎంత మంది తరలి వచ్చినా లేదనుకుంటే కోరుకున్న ఆహారాన్ని తినేయొచ్చు.
గోదావరి రుచులతో పాటు...
వెజ్తో పాటు నాన్ వెజ్లు కూడా నోరూరించేలా సిద్ధం చేస్తారు. రాజమండ్రి మహానాడులో గత నాలుగు రోజుల నుంచి విజయవాడ నుంచి వచ్చిన అంబికా క్యాటరింగ్కు చెందిన పదిహేను వందల మంది భోజనాలను సిద్ధం చేస్తున్నారు. ఈరోజు, రేపు పసందైన వంటకాలను వండి వడ్డించేందుకు సిద్ధం చేశారు. ఒకటి కాదు రెండు కాదు...గోదావరి తో పాటు కోస్తాంధ్ర రుచులతో కూడిన వంటకాలు పదుల సంఖ్యలో సిద్ధమయ్యాయి. సామాన్య కార్యకర్త నుంచి పార్టీ అధినేత వరకూ ఒకే రకమైన భోజనాన్ని అందించాలన్న ఆదేశాలతో అంతా సిద్ధం చేశామని చేయి తిరిగిన వంటగాళ్లు మీడియాతో చెబుతున్నారు. గత రెండు రోజులుగా కార్యకర్తల సమావేశాలు జరుగుతున్నాయి. వారికి కూడా వంటలను సిద్ధం చేసి వడ్డించి పెట్టారు.
టిఫిన్ కూడా అదిరింది...
ఇక ఈరోజు లక్ష మంది వరకూ వచ్చే అవకాశముందని అంచనా వేసి అందుకు అనుగుణంగా సిద్ధం చేశారు. ఈరోజు టిఫిన్ కింద ఇడ్లీ, పునుగులు, వడ, పొంగల్, టమాటా బాత్, మైసూర్ బజ్జీ, కొబ్బరి చట్నీతో పాట అల్లం చట్నీ, సాంబారుతో కార్యకర్తల కడుపు నింపారు. ఈరోజు మధ్యాహ్నం భోజనంలో వెజ్ బిర్యానీ, ఆలు కూర్మా, పెరుగు చట్నీ, మిక్స్డ్ వెజిటబలు్ కర్రీ, బెండకాయ కూర, మామిడికాయ పప్పు, దొండకాయ ఫ్రై, గుత్తి వంకాయ కూర, గోంగూర, టమాటా మునక్కాయ, ఆవకాయ, దోస ఆవకాయ, సాంబారు, మజ్జిగ పులుసుతో పాటు పెరుగును కూడా వడ్డించనున్నారు.
నాన్ వెజ్ వంటకాలయితే...
ఇక రేపు పదిహేను లక్షల మంది హాజరవుతారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. వారిందరికీ రుచికరమైన భోజనం అందించేందుకు సిద్ధం చేశారు. మటన్ కర్రీ, చికెన్ కర్రీ, చేపల పులుసు, రొయ్యల కూర, రొయ్యల వేపుడు, మటన్ పలావ్, చికెన్ పలావ్తో పాటు వెజ్ వంటకాలను కూడా సిద్ధం చేస్తున్నారు. రేపు మెనూలో సాంబారు రైస్ తో పాటు, చక్కెర పొంగిలి, పెరుగన్నం కూడా పెట్టనున్నారు. ఇక కాకినాడ కాజా, తాపేశ్వరం మడత కాజా, లడ్డూలతో పాటు మరికొన్ని స్వీట్లను సిద్ధం చేస్తున్నారు. మొత్తం మీద ఈ మహానాడుకు వచ్చిన ప్రతి కార్యకర్త సుష్టుగా భోంచేసి పార్టీ నాయకత్వం ఇచ్చిన విందును ఆరగించి నియోజకవర్గాల్లోకి వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నారు.
Next Story