Wed Jan 15 2025 22:42:59 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ టీడీపీ గేట్వే మారుతుందా?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలో చేరడానికి గేట్వేగా మారుతుంది
అవును... తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పెద్దగా లేదు. చచ్చిపోయింది అని చెప్పేకన్నా చంపేశారనే చెప్పాలి. 2014 తర్వాత కొంత పార్టీ ఇక్కడ కనిపించినట్లు అనిపించినా ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు హడావిడిగా అమరావతికి బయలుదేరి వెళ్లారు. అప్పటి నుంచి తెలంగాణ పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. గెలిచిన ఒకరిద్దరూ అధికార టీఆర్ఎస్ వైపు వెళుతున్నారు. 2014లోనూ, 2018లోనూ అదే సీన్. అందుకే టీడీపీకి కొంత బలమున్న స్థానాల్లో మాత్రం అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీలో గెలిచినా తర్వాత ఏది అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి సునాయాసంగా వెళ్లే అవకాశముంది. అందుకే తెలంగాణ టీడీపీలో నేతలు పెద్దగా లేకపోయినా కొన్ని నియోజకవర్గాలకు మాత్రం అభ్యర్థులు ఎక్కువగానే కనిపిస్తారు.
ఎవరు వెళుతున్నారా?
2014 తర్వాత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమయ్యారు. అక్కడ బలమైన వైసీపీ ఉండటంతో అక్కడే దృష్టి పెట్టారు. 2014లో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ పెద్దగా ఇరగదీసింది ఏమీ లేదు. ఏడాదికి ఒకటి రెండు సార్లు మాత్రమే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు రావడం అలవాటుగా మార్చుకున్నారు. దీంతో ముఖ్యమైన నేతలు అందరూ పార్టీని వదిలి వెళ్లిపోయారు. పార్టీ నేతలు వెళ్లిపోతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు పిలిచి కూడా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. దీంతో రేవంత్ రెడ్డి లాంటి నేతలు కూడా తమ దారి తాము చూసుకున్నారు. ఇక టీడీపీ ఇక్కడ బలోపేతమయ్యే అవకాశం లేదని భావించిన నేతలు వరసగా వెళ్లిపోయారు. ఇక మిగిలిన అరకొర నేతలు రాజకీయంగా ప్రజలకు దూరమయిన నేతలు మాత్రమే మిగిలారు.
ఎల్. రమణను పిలిచి మరీ...
ఇక పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన వారు సయితం వెళ్లిపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిలో ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిచి మరీ పదవి ఇస్తారన్న ఆశ కూడా వారిలో లేకపోలేదు. అలాగే గతంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణను పార్టీలోకి ఆహ్వానించి వెంటనే కేసీఆర్ ఎమ్మెల్సీని చేశారు. రేపు కూడా అంతేనన్న ఆలోచనలో పార్టీ అధ్యక్ష పదవిని తీసుకునేందుకు నేతలు ముందుకు వస్తున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఈ కోవకు చెందిన నేతే. ఆయన తన రాకతో పార్టీ బలపడిపోతుందని రాలేదు. టీడీపీపై పిచ్చి అభిమానం అంతకంటే లేదు. ఏదో ఒక పదవి కావాలి. డబ్బు ఉంది. కులం ఉంది. దీంతో ఒక ముఖ్యమైన పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా మారితే రాజకీయంగా భవిష్యత్ ఉంటుందన్న అంచనాతోనే టీడీపీలో చేరి పార్టీ పగ్గాలు చేపట్టారు.
భవిష్యత్ పెట్టుబడిగానే...
రేపు ఎన్నికలయ్యేంత వరకూ కాసాని జ్ఞానేశ్వర్ ఆ పదవిలో ఉంటాడు. పార్టీ కార్యక్రమాలకు ఆయనే ఖర్చు చేస్తాడు. ఇటీవల జరిగిన 41వ ఆవిర్భావ సభను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించడానికి ఆయనే ఖర్చు పెట్టారంటున్నారు. ఖమ్మంలో జరిగిన సభకు కూడా బాగానే చేతిచమురు వదిలిందని చెబుతున్నారు. అయితే భవిష్యత్లో ఎల్. రమణ మాదిరిగా తనకూ అవకాశం రాకపోతుందా? అన్న ఎదురు చూపులతోనే పార్టీకి ఆయన ఖర్చుచేస్తున్నారు. భవిష్యత్ పెట్టుబడిగానే చూస్తున్నాడు. చంద్రబాబు కూడా ఏమీ లేనిచోట డబ్బులు పెట్టే వాళ్ల చేతిలో పార్టీని పెడితే ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని భావించి మౌనంగా ఉన్నారు తప్పించి తెలంగాణలో టీడీపీ బలోపేతం అవుతుందన్న నమ్మకం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు దక్కించుకున్న టీడీపీకి, ఈసారి ఆ స్థానాలు కూడా రావడం కష్టమేనన్నది విశ్లేషకుల అంచనా.
Next Story