Sat Dec 21 2024 16:02:32 GMT+0000 (Coordinated Universal Time)
సిద్దూ చివరకు ముంచేస్తారా ఏంది?
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్కు కొద్డో గొప్పో సానుకూల పవనాలు వీస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అంతే. 75 ఏళ్ల వయసులోనూ పదవులు పట్టుకునే వారున్నంత కాలం ఆ పార్టీ మనుగడ కష్టమే. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్కు కొద్డో గొప్పో సానుకూల పవనాలు వీస్తున్నాయి. కొన్ని సర్వేల్లో కూడా కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని చెబుతున్నారు. బీజేపీ కూడా చాలా మంది సిట్టింగ్లకు టిక్కెట్లు ఇవ్వకపోవడంతో అక్కడ కూడా అసంతృప్తి మొదలయింది. కొందరు రాజీనామా బాట పడుతున్నారు. అయితే కాంగ్రెస్లో మాత్రం ముఖ్యమంత్రి పదవి కోసం మాత్రం పెద్ద యుద్ధమే జరుగుతుంది. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు ముఖ్యమంత్రి పదవి కోసం ఇప్పటి నుంచే పోటీ పడుతున్నారు.
సీఎం సీటు కోసం...
ఆలూ లేదు.. సూలూ లేదు అన్న సామెతగా ముందు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అధికారంలోకి రావాలి. అందుకు శ్రమించాల్సిన నేతలు సీఎం కుర్చీ కోసం తన్నులాట ప్రారంభించారు. దీనికి తోడు బీజేపీ మాత్రం మైండ్ గేమ్ మొదలు పెట్టింది. లింగాయత్లను ఆకట్టుకునేందుకు డీకే శివకుమార్కు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ముఖ్యమంత్రి పదవి దక్కదని ప్రచారం మొదలుపెట్టింది. బీజేపీ ప్రచారానికి తగినట్లుగానే సిద్ధరామయ్య కూడా తానే ముఖ్యమంత్రి నంటూ పలు చోట్ల వ్యాఖ్యానాలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. మే 10వ తేదీన ఒకే దశలో కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ జరగకముందే పోరు మాత్రం మొదలయింది. దీంతో అసలు కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి వచ్చేటన్ని స్థానాలు వస్తాయా? అన్నది కూడా అనుమానంగానే కనిపిస్తుంది.
డీకే కష్టపడుతున్నా...
డీకే శివకుమార్ బలమైన నేత. ఆర్థికంగా, సామాజికపరంగా ఆయన ముఖ్యమైన నేత. ఆయనకు సోనియా అండదండలున్నాయి. అయితే ఆయనపై పలు రకాల ఆదాయపు పన్ను శాఖ కేసులు ఉండటంతో దానిని అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారు. ఆయన ఐదేళ్లపాటు ఏకబిగిన ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోసారి కోరుకోవడంలో తప్పులేదు కాని, మిగిలిన వారికి కూడా అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ గత కొన్నేళ్ల నుంచి పార్టీ కోసం శ్రమిస్తున్నారు. ఆయన నేతృత్వంలోనే పార్టీ బలపడిందని చెప్పక తప్పదు. డబ్బు పరంగా, బీజేపీ నుంచి కేసుల పరంగా అన్నీ ఎదుర్కొని డీకే కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడ్డారన్నది ఆయన వర్గీయుల వాదన.
నాకేనంటున్న సిద్ధూ...
మరోవైపు కేసులున్న వారికి హైకమాండ్ సీఎం సీటు ఇస్తే నగుబాటు తప్పదని సిద్ధరామయ్య వర్గం చెబుతోంది. ముందుగా ఇరు వర్గాలు కలసి పార్టీని సమిష్టిగా అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కర్ణాటకలో తిరిగి హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని సర్వేలు వెలువడుతున్న నేపథ్యంలో అసలుకే ఎసరు వచ్చే అవకాశముంది. దానికి తావివ్వకుండా సొంతంగా అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. వాతావరణం బాగుంది. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది. కానీ నేతలు మాత్రం సీఎం సీటు కోసం కొట్టుకు ఛస్తున్నారు. మరి చివరకు ముఖ్యమంత్రి పదవి మళ్లీ కుమారస్వామికి దక్కినా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదన్నది మరికొందరి అభిప్రాయం.
Next Story