Sun Dec 22 2024 18:41:57 GMT+0000 (Coordinated Universal Time)
.సవాంగ్ పై ఈ సాఫ్ట్ కార్నర్ ఎందుకో?
గతంలో గౌతం సవాంగ్ ను టీడీపీ దారుణంగా విమర్శలు చేసింది. ఇప్పుడు మాత్రం ఆయనపై సాఫ్ట్ కార్నర్ ను ప్రదర్శిస్తోంది
పదవిలో ఉన్నప్పుడు ఆయన ఏకపక్షంగా వ్యవహరించారు. పదవి దిగిపోయిన వెంటనే ఆయనలోని నిజాయితీ కన్పించింది. నో డౌట్ గౌతం సవాంగ్ నిజాయితీ అధికారి. ఆయన తన కెరీర్ లో ఎప్పుడూ ఆరోపణలను ఎదుర్కొనలేదు. అయితే గతంలో గౌతం సవాంగ్ ను టీడీపీ దారుణంగా విమర్శలు చేసింది. జగన్ రెడ్డి గౌతం సవాంగ్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని కూడా బుద్దా వెంకన్న లాంటి నేతలు విమర్శలు చేశారు.
గతంలో ఇలా ....
చంద్రబాబు ఇంటి వద్ద జోగి రమేష్ ఆందోళన చేసినప్పుడు కాని, తిరుపతి ఎయిర్ పోర్టులో చంద్రబాబును అడ్డుకున్నప్పుడు, విశాఖకు వెళ్లనివ్వకుండా నిరోధించినప్పుడు టీడీపీకి గౌతం సవాంగ్ లక్ష్యంగా మారారు. రాష్ట్రంలో ఐపీసీ బదులు వైసీీపీ సెక్షన్లు నడుస్తున్నాయని కూడా చెప్పారు. అయితే గౌతం సవాంగ్ ను బదిలీ చేసిన తర్వాత మాత్రం తెలుగుదేశం పార్టీ టోన్ మారింది. సవాంగ్ పట్ల సాఫ్ట్ కార్నర్ గా ఉంది.
ఇప్పుడు ఇలా....
గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేయడం తప్పు అనే ధోరణిలో పార్టీ పై స్థాయి నుంచి కిందిస్థాయి నాయకులు మాట్లాడుతుండటం విశేషం. గౌతం సవాంగ్ ను అడ్డగోలుగా వాడుకుని జగన్ వదిలేశారని టీడీపీ ఆరోపిస్తుంది. గౌతం సవాంగ్ పై ఒక్కసారిగా ఇలా ప్రేమ పుట్టడానికి కారణం కొత్త డీజీపీ నియామకమేనంటున్నారు. కొత్త డీజీపీగా రాజేంద్ర నాధ్ రెడ్డి నియామకం అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతల వాయిస్ ఛేంజ్ అయింది.
జగన్ నిర్ణయాలపై....
అధికారుల బదిలీ అనేది ముఖ్యమంత్రి ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఆయన నిర్ణయం మేరకే అధికారులకు పోస్టింగ్ లు వస్తాయి. చంద్రబాబు అయినా, జగన్ అయినా తమకు అనుకూలంగా ఉన్న అధికారులనే కీలక పోస్టుల్లో నియమించుకుంటారు. కానీ నిన్నటి వరకూ చేదయిన గౌతం సవాంగ్ నేడు టీడీపీకి తీపిగా మారిపోయారు. జగన్ తీసుకునే ఏ నిర్ణయాన్ని టీడీపీ అంగీకరించదన్న విషయం మరోసారి స్పష్టమయింది.
Next Story