Mon Dec 23 2024 18:58:32 GMT+0000 (Coordinated Universal Time)
కోట్ల కుటుంబం వీఆర్ఎస్ తీసుకోవాల్సిందేనా?
తెలుగుదేశం పార్టీలోనే కోట్ల కుటుంబానికి ప్రత్యర్థులు ఎక్కువవుతున్నారు. ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. పాలిటిక్స్ లో కింగ్ లాగా బతికిన కుటుంబాలు సయితం పరిస్థితులు అనుకూలించక రాజకీయాల నుంచే తప్పుకోవచ్చు. అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కోట్ల కుటుంబం కూడా ఇప్పుడు బలవంతంగా రాజకీయాల నుంచి విరమించుకునే పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీలోనే కోట్ల కుటుంబానికి ప్రత్యర్థులు ఎక్కువవుతున్నారు. మరోసారి పార్టీ మారే ధైర్యం కోట్ల కుటుంబం చేయలేదు.
ఒకప్పుడు శాసించి....
కోట్ల కుటుంబం ఒకప్పుడు కర్నూలు జిల్లాను శాసించింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ఆయన తనయుడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా దశాబ్దాల పాటు కొనసాగారు. అయితే అది గతం. కాంగ్రెస్ లోనే వారి ఆధిపత్యం చెల్లుబాటు అయింది. జాతీయ పార్టీ కావడంతో వారికి ఎదురులేకుండా పోయింది. కానీ ప్రాంతీయ పార్టీల్లో అలా కుదరదని వారికి ఇన్నాళ్లకు తెలిసి వచ్చింది.
రెండు కుటుంబాలకు....
గత ఎన్నికలకు ముందు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరారు. దశాబ్దకాలంగా వైరం ఉన్న కోట్ల, కేఈ కుటుంబాల మధ్య చంద్రబాబు సయోధ్య కుదిర్చారు. అయినా రెండు కుటుంబాలు గత ఎన్నికలలో ఘోర ఓటమిని చవిచూశాయి. ఆలూరు నుంచి పోటీ చేసిన కోట్ల సుజాతమ్మ, కర్నూలు ఎంపీగా పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు మరోసారి కేఈ ఫ్యామిలీతో కోట్ల కుటుంబానికి రాజకీయ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కోట్ల నిర్ణయమేమిటో?
ఆలూరు లేదా కర్నూలు ఎంపీగా పోటీ చేస్తానని కేఈ ప్రభాకర్ ప్రకటించడం సంచలనంగా మారింది. అలాగే 2014లో ఆలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయిన వీరభద్ర గౌడ్ కూడా సీటు తనదేనంటున్నారు. అక్కడ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఇది కోట్ల కుటుంబానికి తలనొప్పిగా మారింది. డోన్ లోనూ టీడీపీ ఇన్ ఛార్జిగా ధర్మవరం సుబ్బారెడ్డిని చంద్రబాబు నియమించారు. దీంతో కోట్లకు అన్ని దారులు మూసుకుపోయేలా ఉన్నాయి. చంద్రబాబు తో చర్చించాక భవిష్యత్ నిర్ణయం తీసుకోవాలని కోట్ల కుటుంబం భావిస్తుంది.
Next Story