Fri Jan 10 2025 20:16:21 GMT+0000 (Coordinated Universal Time)
టీం ఇండియా చెత్త బ్యాటింగ్
భారత్ - ఆస్ట్రేలియా మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఏడు వికెట్లు నష్టపోయి 82 పరుగులు చేసింది
భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఏడు వికెట్లు నష్టపోయి 82 పరుగులు చేసింది. దీంతో భారత్ ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఆస్ట్రేలియా ముందు మరింత స్కోరు చేయాల్సి ఉంటుంది. అక్షర్ పటేల్, అశ్విన్ లు ప్రస్తుతం ఆడుతున్నా ఎంత వరకూ స్కోరు చేయగలుతారన్నది ఆసక్తికరంగా మారింది. 26 ఓవర్లకే ఏడు వికెట్లు కోల్పోయిన భారత్ పెద్దగా స్కోరు చేయకుండానే ఆసిస్ ముందు తలవంచక తప్పేట్లు లేదు.
టాస్ గెలిచి...
ఉదయం టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ 12, గిల్ 14 పరుగులు చేసి ఔటయ్యారు. తర్వాత బరిలోకి దిగిన పుజారా కూడా కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన జడేజా నాలుగు పరుగులు చేసి అవుటయి నిరాశ పర్చాడు. ఇక శ్రేయస్ అయ్యర్ ఎప్పటిలాగానే ఏమీ పరుగులు చేయకుండానే అవుటయ్యాడు.
వరసగా అవుట్ ...
అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కొహ్లి 22 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో టీం ఇండియా అప్పటికే కష్టాల్లో పడినట్లయింది. అనంతరం వికెట్ కీపర్ భరత్ కూడా 17 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో భారత్ 82 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయినట్లయింది. గత మ్యాచ్ ల మాదిరిగా అక్షర్ పటేల్, అశ్విన్ లు ఏదైనా మెరుపులు మెరిపిస్తే తప్ప భారత్ మెరుగైన స్కోరును సాధించలేదు. లంచ్ విరామం తర్వాత వీరిద్దరూ కొంచెం కుదుట పడితేనే భారత్ పరువు నిలబడుతుంది. లేకుంటే అతితక్కువ పరుగులకు చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
Next Story