Mon Dec 23 2024 12:10:06 GMT+0000 (Coordinated Universal Time)
ఎందుకిలా... ఏం చేయాలి?
పొత్తులున్న నేపథ్యంలో జనసేనలోకి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని అనేక మంది ముందుకు రావాల్సి ఉండగా అది జరగడం లేదు
జనసేన పార్టీ పెట్టి ఎనిమిదేళ్లు అవుతుంది. పవన్ కల్యాణ్ వంటి చరిష్మా కలిగిన నేత అధ్యక్షుడిగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు కంటే ఈసారి కొంత భిన్నంగా కనిపిస్తున్నారు. ఆయన పొత్తులను ఆహ్వానిస్తున్నారు. వైసీపీని ఓడించేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పారు. రాజకీయాల్లో భిన్నమైన నేతగా గుర్తింపు పొందారు. ఒక సామాజికవర్గం ఈసారి బలంగా పవన్ కల్యాణ్ కు వెన్నుదన్నుగా ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి.
రెండేళ్ల సమయమే....
ఆంధ్రప్రదేశ్ లో 2024 లో ఎన్నికలు జరగనున్నాయి. జనసేన నేతలయితే 2023 లోనే ఎన్నికలు వస్తున్నాయని చెబుతున్నారు. గత ఎన్నికల్లో 7 శాతం ఓట్లు సంపాదించిన జనసేన ఈసారి భారీగా జనం మద్దతును కూడగట్టుకుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. పవన్ కల్యాణ్ కూడా అదే ధీమాలో ఉన్నారు. గతం కంటే మెరుగైన పనితీరును ప్రదర్శిస్తామని ఆయన నమ్ముతున్నారు. క్షేత్రస్థాయిలో జనసైనికులు కూడా పార్టీ కోసం శ్రమిస్తున్న తీరుతో ఆయన ఆత్మవిశ్వాసం రెట్టింపయింది.
పేరున్న నేత....
ఈ నేపథ్యంలో జనసేనలో విస్తృతంగా చేరికలు ఉండాలి. అయితే ఇంత వరకూ జనసేనలో చేరికలు లేకపోవడం చర్చకు దారి తీస్తుంది. పొత్తులు ఉన్న నేపథ్యంలో జనసేనలోకి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని అనేక మంది ముందుకు రావాల్సి ఉండగా అది జరగడం లేదు. ఒక్కరంటే ఒక్క పేరున్న నేత జనసేనలోకి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇటీవల వైసీపీ నుంచి సస్పెండ్ అయిన కొత్తపల్లి సుబ్బారాయుడు సయితం టీడీపీనే తన ఆప్షన్ గా ఎంచుకున్నారని తెలుస్తుంది.
అడ్డుపడుతున్నారా?
దీంతో జనసేనలో చేరడానికి ఎందుకు నేతలు సుముఖత వ్యక్తం చేయడం లేదన్నది చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ పార్టీలో చేరడానికి గంటా శ్రీనివాసరావు ఎన్నాళ్ల నుంచో ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. కానీ ఆయన చివరకు తెలుగుదేశంలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ముఖ్యులను జనసేనలోకి తీసుకోవడానికి అడ్డుపడుతుందెవరు? పవన్ కల్యాణ్ ను పార్టీలోని కీలక నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారన్న వాదన కూడా లేకపోలేదు. ఏ పార్టీకైనా చేరికలుంటేనే కొంత ఊపు ఉంటుంది. జోష్ వస్తుంది. కానీ జనసేనలో మాత్రం అది కొరవడటం పార్టీ కార్యకర్తల్లో నిరుత్సాహాన్ని కల్గిస్తుంది.
Next Story