Wed Dec 18 2024 07:04:49 GMT+0000 (Coordinated Universal Time)
Cold Waves : చలి తీవ్రత పెరగడానికి కారణాలివేనట..గతంలో లేనిది ఇప్పుడే ఎందుకిలా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత బాగా పెరిగింది. అనేక ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత బాగా పెరిగింది. అనేక ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలికి జనం వణికిపోతున్నారు. గతంలో లేని పరిస్థితులు ఇప్పుడే ఎందుకు వచ్చాయన్న అనుమానాలు అనేక మందికి కలుగుతున్నాయి. అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్పేదేంటంటే పర్యావరణం సమతుల్యత దెబ్బతినడంతో చలితీవ్రతతో పాటు ఈ ఏడాది ఎండ వేడిమి కూడా అధికంగానే ఉంటుందని చెబుతున్నారు. ఎలినినో ప్రభావంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు ప్రపంచమంతా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా అనేక పరిస్థితులను చూడాల్సి వస్తుందని చెబుతున్నారు.
వారం రోజుల నుంచి...
తెలంగాణలో గత వారం రోజుల నుంచి చలితీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం ఒంటి గంట వరకూ చలి తీవ్రత తగ్గడం లేదు. సాయంత్రం ఐదు గంటలకు చలి ప్రారంభమవుతుంది. రాత్రి వేళ ఇక రజాయ్ ని వదిలి జనం బయటకు రావడం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చలిమంటలతో కాలం గడుపుతున్నారు. ఇంట్లో పడుకోలేని పరిస్థితులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండటంతో వారు ఎక్కువగా చలిమంటలు వేసుకుని వెచ్చదనం కోసం పరితపించిపోతున్నారు. నిన్న రాత్రి సాధారణం కంటే అత్యల్పంగా ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జనం ఇళ్లను వదిలి పగటి పూట కూడా బయటకు రావడానికే భయపడిపోతున్నారు.
కనిష్ట స్థాయికి...
హైదరాబాద్ లో 6.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్ లో 7.5, పటాన్ చెర్వులో 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్,మెదక్, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని కూడా పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, పాడేరుల్లో అత్యల్పంగా పది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చలిగాలుత తీవ్రత నుంచి తమను తాము కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తుంది.
Next Story