Mon Dec 23 2024 06:28:53 GMT+0000 (Coordinated Universal Time)
బెంగాల్ లో ఏమయిందో తెలుసా?
ఉత్తర్ ప్రదేశ్ లో ఐదు గురు ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు మంత్రులు బీజేపీని వీడారు. వీరంతా సమాజ్ వాదీ పార్టీలో చేరారు.
ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఏం జరిగిందో మనకు గుర్తుండే ఉంటుంది. ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ ను బీజేపీ ఉరికించింది. ఉడికించింది. టీఎంసీ ఎమ్మెల్యేలను, మంత్రులను పెద్ద సంఖ్యలో ఎక్కువ మందిని బీజేపీలో చేర్చుకుని మానసికంగా టీఎంసీని దెబ్బకొట్టింది. అప్పటికే పదేళ్లుగా అధికారంలో ఉన్న టీఎంసీపై వ్యతిరేకత ఉంటుందని భావించిన నేతలు సయితం బీజేపీలోకి జంప్ చేశారు.
ఈసారి యూపీలో....
కానీ మూడోసారి టీఎంసీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా అదే సీన్ స్పష్టంగా కన్పిస్తుంది. ఎన్నికలకు ముందు బీజేపీని వీడుతున్న నేతలు సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వస్తుందన్న గట్టి అంచనాలో ఉన్నారు. అందుకే పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు ఎస్పీలో చేరుతున్నారు. ఐదు గురు ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు మంత్రులు పార్టీని వీడారు. వీరంగా ఎస్పీలో చేరారు. వీరందరికీ అఖిలేష్ యాదవ్ స్వయంగా పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్ని ఇచ్చారు.
చేరినంత మాత్రాన....
ఇదంతా ఓకే కాని మంత్రులు, ఎమ్మెల్యేలు చేరినంత మాత్రాన పార్టీ అధికారంలోకి వస్తుందనుకోవడం కల్ల. గతంలో పశ్చిమ బెంగాల్, బీహార్ ఎన్నికల్లో కూడా ఎవరు పార్టీలో చేరినా విపక్షం అధికారంలోకి రాలేదు. ఇప్పుడు బీజేపీ నేతలు కూడా అదే అంటున్నారు. నేతలు పోయినంత మాత్రాన ఓటు బ్యాంకు చెక్కుచెదరదని, నేతలు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి నష్టం జరిగేన అవకాశాలు లేవు. అఖిలేష్ యాదవ్ మాత్రం మూడు, నాలుగు సీట్లు మాత్రమే ఈసారి బీజేపీకి వస్తాయని జోస్యం చెబుతున్నారు.
సర్వేలు మాత్రం....
కానీ ఇతర సంస్థల సర్వే ప్రకారం బీజేపీకి ఎక్కువ విజయావకాశాలున్నాయని చెబుతున్నారు. సర్వేల్లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత వస్తుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 403 స్థానాల్లో ఈసారి 202 స్థానాల మ్యాజిక్ ఫిగర్ కు బీజేపీ చేరువవుతుందని చెబుతున్నాయి. బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి బీజేపీకి లబ్ది చేకూరుతుందన్న అంచనా వినపడుతుంది. అందుకే చేరికలను చూసి మురిసి పోతే ... చివరకు అఖిలేష్ కు పరాభవం తప్పదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story