Mon Dec 23 2024 03:26:48 GMT+0000 (Coordinated Universal Time)
మల్లారెడ్డిపై ఐటీ దాడి మహాపరాధమా?
మంత్రి మల్లారెడ్డి ఇంట్లోనూ ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లల్లోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
ఏం మల్లారెడ్డిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయకూడదా? ఆయన ఆస్తులన్నీ సక్రమంగానే సంపాదించారా? పాల వ్యాపారం నుంచి విద్యావ్యాపారానికి ఎదిగిన మల్లారెడ్డి ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించాడని విపక్షాలు సూటిగానే ప్రశ్నిస్తున్నాయి. ఈరోజు తెల్లవారు జామునుంచే మల్లారెడ్డి ఇంట్లోనూ ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లల్లోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇదేదో మహాపరాధమయినట్లు టీఆర్ఎస్ కు చెందిన నగర ఎమ్మెల్యేలు, మంత్రులు కలసి ఆయన ఇళ్లపై దాడులను ఖండించారు.
కక్ష సాధింపు చర్యల్లో...
కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపినట్లు మంత్రులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన సంస్థలను ఉసి గొల్పి మంత్రి మల్లారెడ్డి ఇళ్లపైనా, ఆయన నిర్వహించే వ్యాపార సంస్థలపైనా దాడులు చేయడాన్ని టీఆర్ఎస్ ఖండించింది. టీఆర్ఎస్ నేతలను భయభ్రాంతులను చేయడానికే ఐటీ ద్వారా దాడులకు బీజేపీ పురిగొల్పుతుందని మంత్రులు ఆరోపించారు. అయినా దేనికీ భయపడేది లేదని వారు అంటున్నారు. ఎవరింటిపైనా దాడులు చేసుకోవచ్చని, తాము సహకరిస్తామని చెబుతూనే బీజేపీపై విమర్శలకు దిగారు టీఆర్ఎస్ నేతలు.
లెక్కలు పక్కాగా లేవని...
మల్లారెడ్డి కష్టపడి పైకి వచ్చారు. అందులో నిజముంది. అయితే ఆయన చేయని వ్యాపారం లేదు. కుటుంబ సభ్యులు రియల్ ఎస్టేట్ లోనూ పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. మెడికల్ కళాశాల, యూనివర్సిటీతో పాటు 38 ఇంజినీరింగ్ కళాశాలలు మల్లారెడ్డి కుటుంబం నిర్వహిస్తుంది. అయితే లెక్కలు పక్కాగా లేవని, మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో సీట్లు అమ్ముకున్నారన్న ఫిర్యాదులు ఆదాయపు పన్ను శాఖకు అందినట్లు తెలిసింది. క్రాంతి బ్యాంకులో పెద్దమొత్తంలో నగదును, బంగారాన్ని దాచి పెట్టారన్న ఉప్పందండటంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఒక వ్యాపారమా?
మల్లారెడ్డి ఇళ్లు, ఆయన నిర్వహించే వ్యాపార కేంద్రాలపై దాడులు చేయడానికి నేరుగా ఢిల్లీ నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు రావడం విశేషం. నాలుగు మల్లారెడ్డి మెడికల్ కళాశాలల్లో జరిగిన బ్యాంకు లావాదేవీలను ఐటీ శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. భారీగా పన్ను ఎగవేసినట్లు గుర్తించి ఈ దాడులు చేస్తున్నారని, ఇందులో తప్పేముందని బీజేపీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంతా సజావుగా ఉంటే భయపడాల్సిన పనేముంది? అని వారంటున్నారు. మొత్తం మీద మల్లారెడ్డి ఇంటిపై దాడులు టీఆర్ఎస్ నేతలను షేక్ చేస్తున్నాయనే చెప్పాలి. పైకి బింకంగా ఉన్నా ఎవరికి వారు తమ ఆదాయ, వ్యయాల విషయంలో లెక్కలు పక్కగా ఉంచుకోవడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. నిజంగా మల్లారెడ్డి ఎలాంటి అవకతవకలకు పాల్పడకపోతే ఆయనను ఐటీ కాదు కదా? మరే శాఖ ఏం చేయలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు.
Next Story