ఐటీ....నెక్ట్స్ టార్గెట్ ఎవరు....?
ఆంధ్రప్రదేశ్ లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. వరుసగా తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లపై దాడులు జరుగుతుండటంతో నెక్ట్స్ ఎవరు? అన్న చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది. భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని అందరూ అప్రమత్తంగా ఉండాలని నేతలను అనేక సమావేశాల్లో హెచ్చరించారు. అలాగే ఇక సినీనటుడు శివాజీ సయితం ఆపరేషన్ గరుడ స్టార్ట్ అవుతుందని జోస్యం కూడా చెప్పేశారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత మోదీ రాష్ట్రానికి చేసిన అన్యాయంపై చంద్రబాబునాయుడు ఊరారా తిరుగుతూ ధర్మ పోరాట దీక్షల పేరుతో స్వరం పెంచారు.
టీడీపీ నేతలకు....
అయితే గత పదిహేను రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ నేతలకు నిద్ర ఉండటం లేదు. ఎప్పుడు ఐటీ అధికారులు వచ్చి ఇళ్లలో సోదాలు చేస్తారోనన్న బెంగ పట్టుకుంది. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయిన రేవంత్ రెడ్డి ఇళ్లు, ఆయన బంధువుల నివాసాలపై దాడులు ప్రారంభమయ్యాయి. ఏకంగా 48 గంటల పాటు రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాలు జరిపిన ఐటీ అధికారులు ఆ తర్వాత ఆయన వద్ద నుంచి ఏం లభించాయో బయటకు చెప్పలేదు. రేవంత్ తో మొదలయిన ఆదాయపు పన్నుల సోదాల పర్వం ఏపీలో నేటికీ కొనసాగుతూనే ఉంది.
వరుస దాడులతో.....
నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు బీద రవిచంద్ర, బీద మస్తాన్ రావుల ఇళ్లపై, వ్యాపార సంస్థలపై దాడులు జరిగాయి. బీఎంఆర్ గ్రూపుల్లో దాదాపు రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి వ్యాపార భాగస్వామిగా ఉన్న సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు కుమారుడి వ్యాపారసంస్థల్లో కూడా సోదాలు నిర్వహించారు. తాజాగా రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిపారు. ఇంకా రమేష్ కు చెందిన ఆస్తుల లెక్కలు తీసే పనిలోనే ఉన్నారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు.
కక్ష సాధింపు అంటున్న.....
తమపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తుందని, దీని వెనక కేంద్రం కుట్ర ఉందన్నది తెలుగుదేశం పార్టీ నేతల ఆరోపణ. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నుంచి లోకేష్ వరకూ ఏపీలో పెట్టుబడులు రాకుండా భయానక వాతావరణం సృష్టిస్తున్నారని, ఆపరేషన్ గరుడ ప్రారంభమయిందని చెబుతున్నారు. బీజేపీ నేతలు మాత్రం లైట్ గా తీసుకోమంటున్నారు. రాష్ట్రంలో ఏసీబీ దాడులు జరిగితే పత్రికల్లో పతాక శీర్షికల్లో అవినీతి పరుల పాలిట సీఎం సింహస్వప్నం అని హెడ్ లైన్ వార్తలు వేయించుకుంటారని, అదే ఐటీ దాడులు చేస్తే కక్ష సాధింపు చర్యలని చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతలు భారీగా అవినీతికి పాల్పడ్డారన్నది బీజేపీ ఆరోపణ.
ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికే....
కాని ఈ దాడులు ఆగవని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. తమ ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికే ఇటువంటి చర్యలకు దిగుతున్నారన్నారు. బీద సోదరులు, సుజనా చౌదరి, సీఎం రమేష్ తర్వాత ఎవరు టార్గెట్ అన్న చర్చ పార్టీలో బలంగా జరుగుతుంది. ఇప్పటికే కొందరు మంత్రులు సీఎంతో భేటీ అయ్యేందుకు అమరావతికి చేరుకున్నారు. చంద్రబాబునాయుడు శ్రీకాకుళం పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఐటీ దాడులపై సమీక్షించనున్నారని తెలిసింది.