Thu Jan 09 2025 18:23:45 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ జగన్ దే జయం.. "ఇండియా టుడే"సర్వే
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే విజయం అని ఇండియా టుడే సర్వే వెల్లడించింది
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే విజయం అని ఇండియా టుడే సర్వే వెల్లడించింది. ఇండియా టుడే సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 18 పార్లమెంటు స్థానాలు, టీడీపీకి ఏడు స్థానాలు దక్కుతాయని సర్వే తేల్చి చెప్పింది. ఆగస్టు ఎడిషన్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ నిర్వహించామని ఇండియా టుడే స్పష్టం చేసింది. గత నెలలో ఇండియా టీవీ కూడా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 19 స్థానాలు, టీడీపీకి ఆరు స్థానాలు లభిస్తాయని చెప్పాయి.
126 స్థానాల వరకూ...
పార్లమెంటు స్థానాలలో ఉన్న నియోజకవర్గాలను బట్టి చూస్తే ఇండియా టీవీ సర్వేలో 133 అసెంబ్లీ స్థానాలు, ఇండియా టుడే సర్వే ప్రకారం 126 అసెంబ్లీ స్థానాలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి వస్తాయిన తేల్చింది. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని తేలింది. రెండు సంస్థలు విడివిడిగా రెండు నెలల్లో చేసిన సర్వేల్లో వైసీపీయే అగ్రస్థానంలో ఉండటం విశేషం.
టగ్ ఆఫ్ వార్....
ఇక తెలంగాణలో కూడా ఇండియా టుడే సర్వే నిర్వహించింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎనిమిది పార్లమెంటు స్థానాలు, భారతీయ జనతాపార్టీకి 6 స్థానాలు లభిస్తాయని తేల్చింది. అంటే గత ఎన్నికల కంటే బీజేపీకి మరో రెండు పార్లమెంటు స్థానాలు పెరుగుతాయన్న మాట. ఇక కాంగ్రెస్ మూడు స్థానాలకే పరిమిత మవుతుంది. తెలంగాణలో పార్లమెంటు స్థానాల ప్రకారం అంచనా వేస్తే టగ్ ఆఫ్ వార్ గానే ఉందని చెప్పాలి. ఇండియా సర్వే ప్రకారం టీఆర్ఎస్ కు 54 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. అధికార టీఆర్ఎస్ కూడా మ్యాజిక్ ఫిగర్ చేరుకునే అవకాశం లేదని పిస్తుంది.
మళ్లీ మోదీకే జై.....
జాతీయ స్థాయిలో మాత్రం మోదీకి ఎదురులేదని ఇండియా టుడే సర్వే తేల్చింది. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, కోవిడ్, పెట్రోలు ధరల పెరుగుదల వంటివి ఏమాత్రం ప్రభావం చూపడం లేదని ఈ సర్వేలో తేలింది. మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ముందంజలో ఉన్నారు. దేశ వ్యాప్తంగా 53 శాతం మంది తిరిగి ప్రధాని మోదీ కావాలని కోరుకుంటున్నారు. కేవలం 9 శాతం మాత్రమే రాహుల్ కావాలని ఆకాంక్షించారు. ఏడు శాతం మంది మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కు అండగా నిలిచారు. జాతీయ స్థాయిలోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీల వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో స్పష్టమయింది.
Next Story