పులులు పిల్లులయ్యాయేంటి...?
స్వదేశంలో తిరుగులేదు. విదేశాల్లోనూ సత్తా చూపడం మొదలు పెట్టారు ధోని నాయకత్వం తరువాత. అదే జోరు కోహ్లీ కొనసాగిస్తూ వచ్చారు. అయితే సీన్ సితార అయ్యింది ఇంగ్లాండ్ టూర్ లో ఐదు టెస్ట్ ల చారిత్రక టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే 2-0 తో వెనుకబడిపోయింది టీం ఇండియా. జోష్ మీద వున్న భారత్ ఇలా వరుస టెస్ట్ లలో బోర్లాపడటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదీ కనీస పోరాటం కూడా చేయకుండా ప్రత్యర్థి ముందు చేతులు ఎత్తేయడాన్ని మరీ తట్టుకోలేకపోతున్నారు. తొలిటెస్ట్ పరాజయం తరువాత అయినా రెండో టెస్ట్ లో పుంజుకుంటుంది అని భావించిన క్రికెట్ అభిమానుల ఆశలపై కోహ్లీ సేన నీళ్లు పోసింది.
రెండో టెస్ట్ లో చాపచుట్టేశారు...
క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ లో పేలవ ప్రదర్శనకు వేదికగా టీం ఇండియా మార్చింది. తొలి ఇన్నింగ్స్ లో 107 పరుగులకు ఆలౌట్ అయితే ఇంగ్లాండ్ 396 /7 వికెట్లు కి ముగించి భారత్ ను రెండవ ఇన్నింగ్స్ కి ఆహ్వానించింది. రెండవ ఇన్నింగ్స్ లో కూడా అదే ఆటతీరు కనపరిచింది టీం ఇండియా. ఆండర్సన్ (4), బ్రాడ్ (4) క్రిష్ వోక్స్ (2) బౌలింగ్ దెబ్బకు 130 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బౌలింగ్ దెబ్బకు భారత టాప్ బ్యాట్సమెన్ విజయ్ మురళి, దినేష్ కార్తీక్, కులదీప్, షమీ డకౌట్ గా వెనుతిరిగారంటే కోహ్లీ సేన పోరాటం ఏ స్థాయిలో సాగిందో తేలిపోతుంది. ఇక మిగిలిన బ్యాట్సమెన్ లో అత్యధిక స్కోర్ (33) పరుగులు చేసిన అశ్విన్ మాత్రమే. కె ఎల్ రాహుల్ (10) పుజారా (17) రహానే (13) కోహ్లీ (17) పాండ్య (26) ఇషాంత్ (2) పరుగులు మాత్రమే అతికష్టం పై చేయడం విశేషం. దాంతో ఇన్నింగ్స్ 159 పరుగులు తేడాతో ఇంగ్లిష్ టీం అఖండ విజయాన్ని నమోదు చేసి టీం ఇండియా కు అతిభారీ షాక్ ఇచ్చింది.