సీఎం ఎవరనేది దాని ప్రకారమే.....!
కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్యలు ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి ఎవరనేది ప్రధాన ప్రశ్న. గ్రూపుల గోలలు, వర్గ విభేదాలతో అట్టుడికిపోతున్న వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దాదాపు అన్ని రాష్ట్రాల్లో చతికల పడింది. అయితే ఛత్తీస్ ఘడ్ కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి ఎంపికలో కొత్త విధానాన్ని కనిపెట్టారు. ఎవరూ నొచ్చుకోకుండా, ఎన్నికలకు ముందు అసమ్మతులు తలెత్తకుండా ఈ న్యూ ఫార్ములా ఛత్తీస్ ఘడ్ లో వర్క్ అవుట్ అయితే ఇక ప్రతి రాష్ట్రంలో ఇదే విధానాన్ని కొనాసాగించవచ్చేమో.
పదిహేనేళ్లుగా.......
ఛత్తీస్ ఘడ్ లో గత పదిహేనేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. అక్కడ బీజేపీయే మూడు దఫాలుగా విజయం సాధిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివర్లో చత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత టీఎస్ సింగ్ డియో ఒక నయా ఫార్ములాను రూపొందించారు. అదేమంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది స్వయంవరం ద్వారా నిర్ణయిస్తామని చెప్పుకొచ్చారు.
స్వయం వరం ద్వారా........
ఛత్తీస్ ఘడ్ కాంగ్రెస్ సీనియర్ నేత టీఎస్ సింగ్ డియో మీడియాతో మాట్లాడుతూ రామాయణంలో శ్రీరామచంద్రుడు 14 ఏళ్లు అరణ్యవాసం చేశారని, అలాగే తాము కూడా పదిహేనేళ్లు పాటు అధికారానికి దూరంగా ఉన్నామని చెప్పారు. అందుకే 14 ఏళ్ల తర్వాత శ్రీరామ చంద్రుడు రామరాజ్యం స్థాపించినట్లుగానే తాము కూడా పదిహేనేళ్ల తర్వాత ఛత్తీస్ ఘడ్ లో అధికారం చేపడతామని ప్రకటించారు. అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది రాముడు పెళ్లిలాగానే స్వయంవరం తరహాలో తేలుస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడే అభ్యర్థులు చాలా మంది ఉన్నారని, అందుకోసమే ఈ ఫార్ములా అని ఆయన చమత్కరించారు. మొత్తం మీద ఈ సీనియర్ కాంగ్రెస్ నేత ఫార్ములా ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందేమో చూడాలి.