మీరది చేస్తే...మేం చేయలేమా?
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారన్న సమాచారంతో టి కాంగ్రెస్ లో కలకలం బయల్దేరింది. టి సర్కార్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళే పక్షంలో సర్వసన్నద్ధం గా ఉండేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తుంది కాంగ్రెస్. టి పిసిసి చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి తదనుగుణంగా కార్యాచరణ రూపొందించేస్తున్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఇస్తే ప్రతిపక్షాలు కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టవచ్చన్న వ్యూహంతో కెసిఆర్ దూకుడు మీద వున్న విషయాన్నీ పసిగట్టి గ్రూప్ లు వర్గాలుగా వున్న కాంగ్రెస్ శ్రేణులను కార్యోన్ముఖులను చేసే పనికి ఉత్తమ్ శ్రీకారం చుట్టేశారు. గులాబీ పార్టీ కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ కదనరంగానికి సిద్ధపడుతుంది హస్తం పార్టీ.
ఇంటింటికి కాంగ్రెస్ ...
ప్రతి నియోజకవర్గంలోని ఇన్ ఛార్జ్ లు పార్టీ నేతలు ఇకపై ఇంటింటికి వెళ్ళి ఓటర్లను నేరుగా కలుసుకునే కార్యక్రమాన్ని కాంగ్రెస్ సిద్ధం చేసింది. ఈ కార్యక్రమం వేగవంతంగా పూర్తి చేసి ఓటర్లను ఒక రౌండ్ చుట్టి వచ్చేయాలన్న వ్యూహాన్ని రూపొందించారు ఉత్తమకుమార్ రెడ్డి. ప్రజలతో మమేకం అయి వారి సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని అవసరమైన అంశాలపై పరిష్కారం కోసం ఉద్యమించాలని టి పిసిసి చీఫ్ పిలుపునిచ్చారు. తెలంగాణ లో రాహుల్ గాంధీ పర్యటన తరువాత జోష్ మీద వున్న కాంగ్రెస్ అదే హుషారు కొనసాగించాలని భావిస్తుంది. అయితే కాంగ్రెస్ గ్రూప్ లు ఏ మేరకు పిసిసి కి సహకరిస్తాయో వేచి చూడాలి.