Mon Dec 23 2024 03:54:52 GMT+0000 (Coordinated Universal Time)
సైకిల్ పార్టీకి సర్వేల భయం
తెలుగుదేశంలో అంతర్మధనం ప్రారంభమయింది. సర్వేలు వైసీపీకి అనుకూలంగా వస్తుండటంతో ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు
తెలుగుదేశం పార్టీలో అంతర్మధనం ప్రారంభమయింది. సర్వేలు వైసీపీకి అనుకూలంగా వస్తుండటంతో ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. తాము అనుకున్నట్లుగా లేదా తమకు అనుకూలమైన పత్రికలు, ఛానెళ్లు ప్రచారం చేస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వంపై అంత వ్యతిరేకత లేదా? పేద వర్గాలతో పాటు ప్రధాన సామాజిక వర్గాలన్నీ వైసీపీ వైపు ఉన్నాయా? అన్న అనుమానం టీడీపీ నేతల్లో కలుగుతుంది. నాయకత్వంలో లోపమా? లేక ప్రజలు నాయకత్వాన్ని నమ్మడం లేదా? అన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతోంది. అయితే ఇంకా ఎన్నికలకు రెండేళ్లు సమయం ఉంది కదా? అని కొందరు సర్దిచెప్పుకుంటున్నారు.
రెండు నెలల్లో...
రెండు నెలల్లో వచ్చిన రెండు సర్వేలు వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. సర్వే చేసింది కూడా ప్రముఖ మీడియా సంస్థలే. ఆషామాషీగా ఆ మీడియా చేయదు. ఇండియా టీవీ, ఇండియా టుడే లు సర్వేలు నిర్వహిస్తే ఆషామాషీగా నిర్వహించవు. ఒకరి ప్రలోభాలకు లొంగి కూడా సర్వే ఫలితాలు వెల్లడించవు. పక్కాగానే సర్వేలు నిర్వహిస్తాయి. రెండు మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ వైసీపీకే అత్యధికంగా ఎంపీ స్థానాలు వస్తాయని తేలడం తెలుగుదేశం పార్టీకి మింగుడు పడటం లేదు. మూడేళ్లలో జగన్ ప్రభుత్వంపై తాము వచ్చిందని భావిస్తున్న వ్యతిరేకత కనిపించక పోవడం వారిని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది.
కారణమదేనా?
తెలుగు మీడియా ఈ సర్వేలు చేసుంటే వెంటనే రియాక్ట్ అయ్యేవారు. జాతీయ మీడియా కావడంతో ఒకింత నమ్మశక్యంగా ఉంటుందన్నది టీడీపీలో కొందరు భావిస్తున్నారు. ప్రధానంగా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చెప్పినట్లుగానే నగదు బదిలీని నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం వంటివి వైసీపీకి అనుకూలంగా మారాయని అంచనా వేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో జగన్ ప్రభుత్వంలో ఏదో ఒక పథకం కింద లబ్ది పొందుతున్న వాళ్లు అధికంగా ఉండటం, చంద్రబాబు వస్తే తమకు ఈ పథకాలు అందవని భావించడం కూడా కారణం కావచ్చన్నది టీడీపీ నేతలు కొందరు విశ్లేషించుకుంటున్నారు.
నాయకత్వంపై.....
దీంతో పాటు చంద్రబాబు నాయకత్వంపై కూడా నమ్మకం లేకపోవడం, చంద్రబాబు పొత్తుల కోసం ఇతర పార్టీల కోసం వెంపర్లాడటం వంటివి కూడా కొంత కారణమయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పుడు టీడీపీకి బలపర్చే ప్రధాన సామాజికవర్గం ఏదీ కూడా కన్పించకపోవడం కూడా పార్టీ పుంజుకోలేక పోవడానికి కారణమని అనుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో బీసీలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని, జగన్ తన హయాంలో ఎంతో కొంత బీసీలకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. అందువల్లనే సర్వేల్లో టీడీపీ బాగా వెనకబడి పోయి ఉందని, జగన్ అధికారంలో ఉండటం, మరో రెండేళ్లు పదవీ కాలం ఉండటంతో ఆయనకు మరింత అడ్వాంటేజీగా మారే అవకాశముందన్న ఆందోళన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతుంది. కొందరు మాత్రం తాము బలంగా ఉన్నామని, నియోజకవర్గంలో తమకు ఢోకా లేదన్న ధీమాతో ఉన్నారు.
Next Story