Sun Dec 15 2024 09:51:05 GMT+0000 (Coordinated Universal Time)
Allu Arjun : అల్లు అర్జున్ అరెస్ట్ లో రాజకీయ కోణం ఏదైనా ఉందా?
అల్లు అర్జున్ అరెస్ట్ లో రాజకీయ కోణం ఏదైనా ఉందా? అన్న చర్చ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది
అల్లు అర్జున్ అరెస్ట్ లో రాజకీయ కోణం ఏదైనా ఉందా? అన్న చర్చ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ స్టార్ అయ్యారు. ఆయనకు యూత్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులు కూడా పెరిగారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, అల్లు అరవింద్ తనయుడు అయిన అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అంటే అంత ఆషామాషీ అయిన విషయం కాదు. కేసు పెట్టిన పోలీసులు వారంతట వారు అరెస్ట్ చేసేందుకు ధైర్యం చేయరు. అందులోనూ నాన్ బెయిల్ కేసులు పెట్టడం కూడా చర్చగా మారింది. అదే సమయంలో ఏదో రాజకీయ కోణం దాగి ఉందన్నది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల నుంచి వస్తున్న సందేహాలు. ఇప్పటికే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అరెస్ట్ పై ఆయన అభిమానులు అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈర్స్యతో జరిగిందేనా?
పుష్ప 2కు ముందు నుంచే ఆయన కొంత టాలీవుడ్ లోనూ అదే సమయంలో కొందరు నటులు, రాజకీయనేతల్లోనూ ఈర్ష్య బాగా పెరిగింది. పుష్ప ఒకటో పార్ట్ రిలీజ్ అయిన వెంటనే అల్లుఅర్జున్ రేంజ్ మారిపోయింది. అప్పటి వరకూ టాలీవుడ్ కే పరిమితమయిన అల్లు అర్జున్ చివరకు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. దీంతో పాటు 2024 ఎన్నికలకు ముందు కొంత వివాదానికి రాజకీయ ఆరోపణలను కూడా ఎదుర్కొన్నారు. 2024 ఎన్నికల సందర్భంగా నంద్యాలకు వెళ్లి శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లడం వివాదంగా మారింది. అది మిగిలిన హీరోల అభిమానులకు మింగుడుపడలేదు. సోషల్ మీడియా వేదికగా దీనిపై అనేక ఆరోపణలు, ప్రత్యారోణలు ఒకరినొకరు చేసుకున్నారు. ప్రధాన పార్టీల నేతలు కూడా అల్లు అర్జున్ పై విమర్శలు చేశారు.
పుష్ప సూపర్ హిట్ కావడంతో...
అదే సమయంలో తన ఇష్టం వచ్చిన చోటికి వెళతానంటూ అల్లు అర్జున్ ఒక ఈవెంట్ లో చేసిన కామెంట్స్ కూడా అప్పట్లో వైరల్ గా మారాయి. అదే సమయంలో పుష్ప 2 విడుదలయి అది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటికే ఈ మూవీ వెయ్యి కోట్ల రూపాయలు దాటేసిందంటున్నారు. ఈసమయంలో అల్లు అర్జున్ అరెస్ట్ జరగడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎన్నడూ లేని విధంగా లక్షలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారంటే అది అంతంత మాత్రం జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అల్లు అర్జున్ అరెస్ట్ వెనక అనేక విషయాలు చోటు చేసుకున్నాయని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో...
అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలే అల్లు అర్జున్ అరెస్ట్ కు కారణమంటూ పెద్దయెత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన సంథ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ రేవతి మరణించడంపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినా ఇది రాజకీయ రంగు పులుముకుంది. అల్లు అర్జున్ తనకు రాజకీయాలకు సంబంధం లేదని, రాజకీయాల్లోకి తాను రానంటూ ప్రకటన కూడా చేశారు. ఈ సమయంలో అల్లు అర్జున్ అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీదఅల్లు అర్జున్ ను పోలీసులు ఇంత వేగంగా అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నారంటే ఏదో జరుగుతుందన్న అనుమానాలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ రాజకీయంగా కూడా రచ్చ అయ్యే అవకాశాలున్నాయి.
Next Story