Tue Nov 05 2024 22:36:18 GMT+0000 (Coordinated Universal Time)
రాధా హత్యకు కుట్ర పన్నింది వారేనా?
వంగవీటి రాధా తనపై హత్యకు కుట్ర జరిగిందని, రెక్కీ కూడా నిర్వహించారని ఆరోపించడంతో ఇది హాట్ టాపిక్ గా మారింది.
వంగవీటి రాధా ను హత్య చేసేందుకు కుట్ర జరిగిందా? రాధాను చంపే అవసరం ఎవరికి ఉంటుంది? రాధా ఎందుకు ఈ ఆరోపణలు చేశారు? కావాలనే చేశారా? లేక నిజంగానే రాధాపై హత్యకు కుట్ర జరిగిందా? దానిపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపడితే కాని వాస్తవాలు బయటకు రావు. నిన్న వంగవీటి రాధా తనపై హత్యకు కుట్ర జరిగిందని, రెక్కీ కూడా నిర్వహించారని ఆరోపించడంతో ఇది హాట్ టాపిక్ గా మారింది.
రెండున్నర నెలల క్రితం....
వంగవీటి రాధా ను హత్య చేసేందుకు కుట్ర జరిగిందట. ఈ నెల అక్టోబరు 19వ తేదీన రెక్కీ నిర్వహించినట్లు రాధా చెబుతున్నారు. అయితే దాదాపు రెండున్నర నెలలయినా రాధా ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారు? అన్నది చర్చనీయాంశమైంది. తన తండ్రి వర్ధంతి రోజునే ఈ ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏంటి? అసలు రాధాను చంపే అవసరం ఎవరికి ఉంటుంది? ఆయనపై హత్యకు కుట్ర చేసిందెవరు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఎవరికి అవసరం?
నిజానికి వంగవీటి రాధాను హత్య చేసే అవసరం రాజకీయంగా ఎవరికి ఉండదు. ఎందుకంటే ఆయన దాదాపు దశాబ్దన్నర కాలంగా రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపడం లేదు. వరస ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో వంగవీటి రాధా పోటీ కూడా చేయలేదు. ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ రాజకీయంగా పెద్దగా శత్రువులు ఎవరూ లేరు. అందరూ సన్నిహితంగా ఉండేవారే.
రాజకీయంగా ఎదిగేందుకేనా?
ఇక బెజవాడ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరపడి దశాబ్దకాలం పైనే అవుతుంది. బలమైన రెండు వర్గాలు ఎవరికి వారు తమ పని తాము చూసుకుంటున్నారు. రాజకీయంగా పైకి ఎదగాలన్న ధ్యాస తప్ప హత్యా రాజకీయాలపై ఎవరూ దృష్టి పెట్టడం లేదు. మరి రాధాను ఎవరు చంపేందుకు కుట్ర పన్నారన్న విషయం తెలియాలంటే పోలీసులు లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. రాధా తన రాజకీయ ఎదుగుదల కోసం ఈ ఆరోపణలు చేశారా? నిజంగానే కుట్ర జరిగిందా? అన్నది ప్రజలకు తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశముంది.
Next Story