Mon Dec 23 2024 12:27:15 GMT+0000 (Coordinated Universal Time)
మోత్కుపల్లి ఫైలు మూలనపడేసినట్లేనా?
మోత్కుపల్లి నరసింహులు టీఆర్ఎస్ లో చేరి ఏడాది కావస్తుంది. కానీ ఆయన ఆశించినట్లు పదవులు ఏమీ పరుగెత్తుకుని రాలేదు
మోత్కుపల్లి నరసింహులు టీఆర్ఎస్ లో చేరి ఏడాది కావస్తుంది. కానీ ఆయన ఆశించినట్లు పదవులు ఏమీ పరుగెత్తుకుని రాలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిపోాయారు. టీఆర్ఎస్ లో కి మోత్కుపల్లి నరసింహులను పార్టీలోకి సాదరంగా కేసీఆర్ ఆహ్వానించారు. యాదాద్రిలో పలుమార్లు ఆయనను పక్కన పెట్టుకుని తిరిగారు. దీంతో మోత్కుపల్లికి ఖచ్చితంగా ఏదో ఒక పదవి వస్తుందని భావించారు. కానీ మధ్యలో హుజూరాబాద్ ఉప ఎన్నికలు రావడంతో అక్కడ పదవులను పంచి పెట్టాల్సి వచ్చింది. దీంతో ఆయనకు కేసీఆర్ పదవి ఇవ్వాలనుకున్నా ఇవ్వలేకపోయారంటారు.
ఉప ఎన్నికల కోసం...
హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నుంచి వచ్చిన కౌశిక్ రెడ్డికి, టీడీపీ నుంచి వచ్చిన ఎల్. రమణకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. కానీ మోత్కుపల్లి వైపు కేసీఆర్ చూడలేదు. ఎందుకంటే ఆ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం కావడంతో మోత్కుపల్లి ఫైల్ ను పక్కన పెట్టారు. ఇక రాజ్యసభ స్థానాలకు వచ్చేసరికి బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించి అటు వైపు కేసీఆర్ మొగ్గు చూపారు. నిజానికి మోత్కుపల్లి నరసింహులు రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే ఈటల రాజేందర్ ఎపిసోడ్ తో పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావించి వారికి, రెడ్లకు కేటాయించారు.
ఇప్పట్లో లేదనే...
దీంతో మోత్కుపల్లి నరసింహులుకు పదవీ యోగం ఇప్పట్లో లేదనే ప్రచారం జరుగుతుంది. నిజానికి అందరికంటే సీనియర్ నేత మోత్కుపల్లి. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆయనకు దళిత సామాజికవర్గం నుంచి ఏదో ఒక పదవికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేస్తారని అందరూ భావించారు. కొద్దికాలం పాటు మోత్కుపల్లి నరసింహులుకు కేసీఆర్ ప్రాధాన్యత కూడా ఇచ్చారు. ఆయనను వెంటేసుకుని తిరగడంతో పదవి ఖాయమని తోటి పార్టీ నేతలు సయితం అంచనా వేశారు. కానీ ఆయన ఫైలును కేసీఆర్ పక్కన పెట్టేసినట్లే కనపడుతుంది.
మునుగోడు ఉప ఎన్నికతో...
కానీ మోత్కుపల్లి నరసింహులుకు ఇప్పటి వరకూ ఎలాంటి పదవి రాలేదు. ఇప్పట్లో ఎలాంటి పదవులు ఖాళీ అయ్యే అవకాశం లేదు. మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంలో మోత్కుపల్లి నరసింహులుకు మరోసారి ప్రాధాన్యత పెరగవచ్చన్న అంచనాలు పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. నల్లగొండ జిల్లా నేత కావడంతో ఆయనకు ఏదో రకంగా ప్రయారిటీ ఇచ్చి ఈ ఎన్నికల నుంచి గట్టెక్కాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఆయనకు ఎలాంటి పదవి ఇచ్చే అవకాశాలు ప్రస్తుతానికి లేవు. మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆయనకు పదవీ యోగం ఉంటుందనేది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. మోత్కుపల్లి అభిమానులు, సన్నిహితులు కూడా ఆయనకు పదవి లభిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు.
Next Story