Mon Dec 23 2024 02:27:24 GMT+0000 (Coordinated Universal Time)
పొలిటికల్ ఫైటర్ ... రూటు మారుతుందా?
హర్షకుమార్ విజయం సాధించి దాదాపు దశాబ్దం దాటి పోయింది. గత రెండేళ్లు ఆయనకు ఎన్నికలు కలసి రాలేదు
పాతతరం నాయకులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. తాము ఇతర పార్టీలోకి వెళ్లేందుకు అహం అడ్డువస్తుంది. అలాగని ఉన్న పార్టీలో ఉండలేరు. దానికి ప్రజలు మద్దతు లేదు. అధికారంలోకి వచ్చే పార్టీలను ఆకర్షించాలంటే తన సత్తా ఏంటో చూపించుకోవాలి. తాను సీనియర్ నేతనే కాని, వృద్ధ నేతను కాదని నిరూపించుకోగలగాలి. రాజకీయ పార్టీలు రా.. రమ్మని ఆహ్వానించాలి. అదే ఇప్పుడు వారికి కావాల్సింది. అందులో ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత హర్షకుమార్ ఒకరు.
దశాబ్దం దాటి పోవడంతో....
హర్షకుమార్ విజయం సాధించి దాదాపు దశాబ్దం దాటి పోయింది. గత రెండేళ్లు ఆయనకు ఎన్నికలు కలసి రాలేదు. గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. రాజమండ్రికి వచ్చిన చంద్రబాబు పాదాలపై హర్షకుమార్ పడ్డారు. అయినా టిక్కెట్ దక్కలేదు. అంటే ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్ ను చంద్రబాబు గుర్తించారనుకోవాలి. తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్ లో చేరారు. రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాతైనా కాంగ్రెస్ పుంజుకుంటుందని భావించారు. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. ప్రజలు హస్తం గుర్తును మర్చిపోయినట్లే కన్పిస్తుంది.
చేవ తగ్గలేదని...
కానీ హర్షకుమార్ రాజకీయాన్ని అంత సులువుగా వదులుకునే నేత కాదు. దళిత నేతల్లో ఫైటర్ అనే చెప్పాలి. తాను అనుకున్నది అనుకున్నట్లు చెప్పేయగల మనస్తత్వం ఆయనది. ఆ వైఖరి జాతీయ పార్టీలలో నప్పుతుంది కాని, ప్రాంతీయ పార్టీలో అస్సలు కుదరదు. హర్షకుమార్ ను చేర్చుకుని ఆయన గెలిపించుకుని నెత్తిన కుంపటి పెట్టుకున్నట్లే భావిస్తారు అధినేతలు. అందుకే ఆయన తన సత్తాను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. తనకు చేవ తగ్గలేదని పార్టీ అధినేతలకు చూపేందుకు రెడీ అయిపోయినట్లే కన్పిస్తున్నారు.
సత్తా చూపేందుకేనా?
వచ్చే సెప్టంబరు నెల 26వ తేదీన రాజమండ్రిలో దళిత సింహగర్జన సభ పెట్టారు. ఈ సభకు రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి పది లక్షల మంది దళితులను సమీకరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ఆయన సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. హర్షకుమార్ వైఖరిని చూస్తుంటే ఏదో ఒక పార్టీ తన సత్తువను గమనించి ఆహ్వానిస్తుందనే ఈ శ్రమంతా పడుతున్నట్లు కనిపిస్తుంది. వైసీపీలోకి ఎటూ హర్షకుమార్ వెళ్లరు. ఆ పరిస్థితి కూడా లేదు. జనసేన, టీడీపీలు తనను ఆహ్వానించి టిక్కెట్ ఇవ్వాలని హర్షకుమార్ ఈ ప్రయత్నాలు ప్రారంభించినట్లే కనపడుతుంది. మరి లేకుంటే రెండేళ్ల ముందు దళిత సింహ గర్జన సభ ఎన్నికలకు రెండేళ్లకు ముందు పెడుతున్నారంటే ఆయన మనసెరిగిన వారు మాత్రం అదే అనుకుంటున్నారు.
Next Story