Sun Nov 17 2024 20:36:46 GMT+0000 (Coordinated Universal Time)
మినీ మహానాడులను మడత్తేసినట్లేనా?
దాదాపు నెల రోజలయింది. టీడీపీ అధినేత చంద్రబాబు మినీ మహానాడుల కాన్సెప్ట్ ను టీడీపీ పక్కన పెట్టినట్లే కనిపిస్తుంది
దాదాపు నెల రోజలయింది. టీడీపీ అధినేత చంద్రబాబు మినీ మహానాడుల కాన్సెప్ట్ ను టీడీపీ పక్కన పెట్టినట్లే కనిపిస్తుంది. మే నెలలో ఒంగోలులో మహానాడు జరిగిన తర్వాత దాని సక్సెస్ చూసి ఇక జిల్లాల్లో మినీ మహానాడులను నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, దానిని సొమ్ము చేసుకోవడానికి జనంలోకి వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. జిల్లాల్లో మినీ మహానాడులను ఏర్పాటు చేసి ఒక బహిరంగ సభ, నియోజకవర్గాలతో సమీక్షలతో చేస్తూ ఇటు క్యాడర్ లో వేడి పుట్టించారు. అటు జనంలోనూ పార్టీకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
అనకాపల్లిలో ప్రారంభం...
అనకాపల్లితో మినీమహానాడును ప్రారంభించారు. అనంతరం విజయనగరంలోనూ మినీ మహానాడు జరిగింది. దీనికి తోడు బాదుడే బాదుడంటూ కడప, అనంతపురం జిల్లాల్లోనూ పర్యటించారు. ఇంకేముంది టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్న కలరింగ్ వచ్చేసింది. టీడీపీ అనుకూల మీడియా అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబుదే అధికారం అంటూ ప్రచారం చేసింది. తర్వాత గుడివాడలో మినీ మహానాడు పెట్టాలని భావించారు. ఎన్టీఆర్ సొంత గ్రామమైన నిమ్మకూరులో నిద్రించాలని కూడా ప్లాన్ చేశారు. కానీ వాతావరణం అనుకూలించలేదని చివరి నిమిషంలో దానిని రద్దు చేశారు.
చివరిగా మదనపల్లెలో...
ఇక చివరిగా జులై 7వ తేదీన మదనపల్లెలో మినీ మహానాడు జరిగింది. ఇది కూడా సక్సెస్ అయింది. నియోజకవర్గాల సమీక్ష కూడా చేశారు. అయితే ఆ తర్వాత మినీ మహానాడుల ఊసే పోలేదు. ఇప్పటికి నెల రోజులయినా ఒక్క జిల్లాలో కూడా మినీ మహానాడును జరపలేదు. అయితే వర్షాలు కురుస్తున్నందున మినీ మహానాడులు జరపలేకపోతున్నామని కొందరు చేస్తున్న వాదనల్లో పసలేదనిపిస్తుంది. ఎందుకంటే జులై ఏడో తేదీ నుంచి నేటి వరకూ ఒక్క మహానాడును కూడా టీడీపీ ప్లాన్ చేయలేదు. 26 జిల్లాల్లో కేవలం నాలుగైదు జిల్లాల్లోనే జరిపి దానిని మడతెట్టేశారన్న విమర్శలు పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.
కాన్సెప్ట్ కు కామా పెట్టేశారా?
అసలు కారణం అది కాదంటున్నారు పార్టీ నేతలు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. రెండేళ్ల ముందే జనంలోకి వెళ్లినా ప్రయోజనం లేదని భావించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటి నుంచి మినీ మహానాడులను 26 జిల్లాల్లో జరిపితే ఖర్చు తడిసి మోపెడవుతుంది. అంతేకాకుండా సభలకు ఖర్చు పెట్టే టీడీపీ నేతలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే వారు రివర్స్ అయ్యే ప్రమాదముంది. అందుకే మినీ మహానాడుల కాన్సెప్ట్ కు కామా పెట్టేశారన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. సెప్టెంబరులో ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ ఉంటుందని ప్రకటించిన చంద్రబాబు మినీమహానాడుల ఊసెత్తకపోవడం ఇందుకేనని అంటున్నారు. మరి మినీ మహానాడులను మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో అని తెలుగు తమ్ముళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
Next Story