Mon Dec 23 2024 11:11:36 GMT+0000 (Coordinated Universal Time)
కామెడీ కాకపోతే ఇంకేంటి? కాసేపు నవ్వుకోండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయి దాదాపు తొమ్మిదేళ్లు కావచ్చింది. ఎవరి రాష్ట్రం వారిది. ఎవరి పాలన వారు చేసుకుంటున్నారు
ఏందో.. విడిపోయిన రాష్ట్రాలు మళ్లీ కలవడం ఏందో? ఉండవల్లి జగన్ ను తిట్టడం ఏందో? దానికి సజ్జల కౌంటర్ ఇవ్వడం ఏందో? తిరిగి తెలంగాణపై కుట్ర జరుగుతుందని కౌంటర్ మీద కౌంటర్లు రావడమేంటో? ఎవరన్నా విన్నవారికి ఇది కామెడీగా అనిపిస్తుంది. అనేవారికి మాత్రం సెంటిమెంట్ గానే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయి దాదాపు తొమ్మిదేళ్లు కావచ్చింది. ఎవరి రాష్ట్రం వారిది. ఎవరి పాలన వారు చేసుకుంటున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా సెంటిమెంట్లు రావడం సహజమే. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి.. సారీ భారతీయ రాష్ట్ర సమితికి మాత్రం ఈసారి తెలంగాణ సెంటిమెంట్ లేదు. అందుకే ఆ పార్టీ అధినేత వేరే రూట్ చూసుకున్నారు కూడా.
ఉబుసుపోక ఉండవల్లి...
అటువంటి సమయంలో రిటైర్డ్ రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఉప్పందించారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర విభజనపై కేసు జరిగిందట. అందులో ఏపీ ప్రభుత్వం తాము కలవడానికి ఇష్టంలేదని చెప్పిందట. అది ముగిసిన అధ్యాయమని చెప్పడంతో జగన్ రాజకీయంగా పతనమైపోతారని కూడా ఉండవల్లి శాపం పెట్టారు. పాపం ఉండవల్లి పని ఏమీలేక.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై ఇంకా న్యాయస్థానంలో పోరాటం చేస్తూనే ఉన్నారు. ఉండవల్లి న్యాయవాది. ఆయన లొసుగులను గుర్తించి ఏదో అవుతుందని భ్రమించి ఇంకా సమైక్య రాష్ట్రం కోసం పరితపిస్తున్నారు. చాదస్తం పెరిగితే అంతే. ఆయన చేసే పోరాటానికి మద్దతుగా ప్రభుత్వం నిలవాలట. విడగొట్టే సమయంలోనే ఎవరూ నిలబడలేదు. ఇప్పుడు ఇంతకాలానికి విడిపోయిన రాష్ట్రం మరలా కలిసేందుకు జగన్ అడ్డంపడ్డాడట. సరే ఉండవల్లి ఉబుసుపోక ఏదో అన్నాడనుకుందాం.
సజ్జల కామెడీగానే అన్నా...
ఈ సజ్జలకేమయింది. అవును మళ్లీ కలిపితే తాము సిద్ధమైనంటూ సై అని అనడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. రెండు రాష్ట్రాల ప్రజలు మానసికంగా విడిపోయి చాలా కాలం అయింది. ఇప్పుడు మళ్లీ కలుపుతామంటే తాము సిద్ధమేనని చెప్పడం ఖచ్చితంగా రాజకీయమే. ఎన్నికలు వస్తున్నాయిగా. అందుకే టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలను దోషులుగా నిలబెట్టడానికి, మరోసారి విభజన ఆగ్రహం ప్రజల్లో రగిలించడానికి సజ్జల చేసిన ఒక ప్రయత్నంగానే చూడాలి. సజ్జల అన్నట్లు నిజంగా మళ్లీ కలుపుతారా ఏంది? ఆయన కామెడీ చేశారు. సజ్జల కామెడీని తెలంగాణ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. పొన్నం ప్రభాకర్ అయితే మరోసారి తెలంగాణపై కుట్ర జరుగతుందని ఆరోపించారు.
సెంటిమెంట్ తో కొట్టాలిగా....
ఇక కాచుకుని కూర్చున్న టీఆర్ఎస్ నేతలు ఊరుకుంటారా? అంది వచ్చిన అస్త్రాన్ని వదులుకుంటారా? అవునవును.. కేంద్రం అండతోనే సజ్జల ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని ముక్తాయింపు కూడా ఇచ్చేశారు. తెలంగాణను తిరిగి ఆంధ్రలో కలుపుకోవడానికి కుట్రలు జరుగుతున్నాయని టీఆర్ఎస్ నేతలు, మంత్రులు ధ్వజమెత్తుతున్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సందేశాలను ఇస్తున్నారు. విడిపోయి దాదాపు పదేళ్లవుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లను కలిపేందుకు ఎవరు ముందుకొస్తారు? ఆ నిర్ణయం ఎవరు తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు? కలిపితే ఎవరికి ప్రయోజనం? లాంటి లాజిక్ లు మిస్సయి సెంటిమెంట్ కోసం తెగ హైరానా పడిపోతున్నారు. కామెడీ కాకపోతే ఏంటి? కాసేపు నవ్వుకోవడానికి మాత్రం ఈ కామెంట్స్ పనికొస్తాయని చెప్పకతప్పదు. రెండు రాష్ట్రాల ప్రజలు కాసేపు నవ్వుకోవడానికి తప్పించి ఈ వాగ్వాదాలు ఎందుకైనా పనికొస్తాయా? అంటే.. అంతేమరి. ఎన్నికలు వస్తున్నాయిగా. అక్కడా.. ఇక్కడా ఆ అవసరం అధికార పార్టీకే ఉంటుంది మరి.
Next Story