Mon Dec 23 2024 17:23:45 GMT+0000 (Coordinated Universal Time)
నలభై ఏళ్లు... ఇప్పటికీ ప్రజల గుండెల్లో...?
టీడీపీ ఆవిర్భవించి నేటికి నలభై ఏళ్లయింది. 1982 మార్చి 29న హైదరాబాద్ లో ఎన్టీఆర్ పార్టీని పెట్టబోతున్నట్లు ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి నలభై సంవత్సరాలు అయింది. 1982 మార్చి 29న హైదరాబాద్ లో ఎన్టీఆర్ రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీగా ఆయన నామకరణం చేశారు. ఆ తర్వాత టీడీపీ ప్రభంజనం ఆగలేదు. తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ రాష్ట్రంలో పర్యటించారు. రోడ్డు మీదే స్నానాలు చేస్తూ రేయింబగళ్లూ రాష్ట్రంలో పర్యటించారు. సినిమా వాడికి జనం ఓట్లేయ్యరన్న కాంగ్రెస్ నేతల ఎద్దేవాను ఎన్టీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. తన లక్ష్యం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడమే.
ఎన్టీఆర్ పిలుపుతో....
తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదిలిరా అన్న ఎన్టీఆర్ నినాదానికి భారీ స్పందన లభించింది. కుల, మతాలకు అతీతంగా జనం ఎన్టీఆర్ వైపు నిలబడ్డారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిన పాలన ఇక వద్దనుకున్న ప్రజలు ఎన్టీఆర్ పక్షాన నిలబడ్డారు. ఫలితంగా 1983 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. అయితే 1984 ఆగస్టులో వచ్చిన సంక్షోభం కారణంగా నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అప్పటి గవర్నర్ రామ్ లాల్, ప్రధాని ఇందిరా గాంధీలకు వ్యతిరేకంగా నెల రోజుల పాటు ఆందోళన చేపట్టిన తర్వాత తిరిగి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాగలిగారు.
మూడుసార్లు...
ఎన్టీఆర్ తన హయాంలో మూడుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చారు. అనంతరం 1994లో పార్టీలో మరో సంక్షోభం ఏర్పడింది. లక్ష్మ్మీ పార్వతి పెత్తనాన్ని సహించలేని చంద్రబాబు వైశ్రాయ్ హోటల్ లో ఎమ్మెల్యేలను కూడగట్టి ఎన్టీఆర్ ను గద్దె దించి తాను ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి మీడియా, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబుకు మద్దతు పలకడంతో ఆయన సులువుగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చింది.
బాబు సీఎంగా....
చంద్రబాబు కూడా రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. 1999, 2014లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. ముఖ్యమంత్రిగా కాకుండా రాష్ట్రానికి సీఈవోగా తనను తాను చంద్రబాబు అభివర్ణించుకున్నారు. ఎన్టీఆర్ సంపాదించిపెట్టిన ఓటు బ్యాంకును పకడ్బందీగా కాపాడుకోగలిగారు. నలభై ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో ఎన్నో విజయాలు, అపజయాలు చూశారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చేరిన నేతలు నేటికీ కొనసాగుతున్నారు. నలభై ఏళ్ల ఆవిర్భావ వేడుకలను నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జరుపుకోనుంది.
Next Story