Fri Nov 22 2024 23:55:04 GMT+0000 (Coordinated Universal Time)
బెజవాడ ఫస్ట్ స్ట్రోక్ బాగా పడినట్లుందే...?
జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అయింది. ఇప్పటి వరకూ జగన్ కు సరైన స్ట్రోక్ పడలేదు.
జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అయింది. ఇప్పటి వరకూ జగన్ కు సరైన స్ట్రోక్ పడలేదు. విపక్షాలను అన్ని రకాలుగా దెబ్బతీయడంతో వారు ఆందోళన చేయడానికి కూడా ముందుకు రాలేదు. ప్రధానంగా టీడీపీ అనేక రకాలు ఆందోళనలు చేసినా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. విపక్ష నేతలపై కేసులు పెడుతుండటం, ఆర్థిక మూలాలను దెబ్బతీయడంతో వారు ఎవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు రాలేదు.
రెండున్నరేళ్లలో....
జగన్ తన పాలనపై పూర్తి సంతృప్తి ఉందని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉండి భావించి ఉండవచ్చు. వరసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటం, ఎన్నికల్లో వన్ సైడ్ విజయాలు లభించడంతో జగన్ తనకు తిరుగులేదని అనుకుని ఉండవచ్చు. కానీ అది అపోహ అని మాత్రమే తేలింది. ఫస్ట్ ట్రోక్ బెజవాడ వేదికగా పడిందనే చెప్పాలి. రెండున్నరేళ్లలో తొలిసారి జగన్ కు వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గళమెత్తాయి. కదంతొక్కాయి.
ప్రభుత్వానికి హెచ్చరికలు....
బెజవాడ వీధులన్నీ ఉద్యోగ, ఉపాధ్యాయులతో కిక్కిరిసి పోయాయి. ప్రభుత్వానికి, జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతు చూస్తామని వేదికపై నుంచి ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. అంటే ప్రభుత్వంపై ఉన్న భయం పోయినట్లే. ఇన్నాళ్లూ గుప్పిట మూసి ఉంచింది బయటపడినట్లే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 13 జిల్లాల నుంచి లక్షలాది మంది ఉద్యోగులు బెజవాడకు తరలి వచ్చారు. వారిని కట్టడి చేయడం కూడా పోలీసులకు కష్టసాధ్యమయంది.
గోటితో పోయేదాన్ని....
ఉద్యోగులు, పింఛనుదారుల కుటుంబ సభ్యులు మొత్తం 75 లక్షల మంది ఉన్నామని వారు ప్రభుత్వానికి బెజవాడ నుంచి హెచ్చరిక చేశారు. ఇది జగన్ ప్రభుత్వానికి ఒక రకంగా గుణపాఠమనే చెప్పాలి. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారన్న సామెత ఉద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వానికి సరిపోతుంది. ఉద్యోగుల వల్ల తనకు ఏమీ నష్టం జరగదని ప్రభుత్వం భావించవచ్చు. కానీ ఇప్పుడు బెజవాడలో జరిగిన కార్యక్రమానికి చూసిన వారికి ఎవరికైనా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లేనని చెప్పకతప్పదు.
Next Story