ఐటీ విచారణలో రేవంత్ ఏం చెప్పారు..?
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని ఐటీ అధికారులు సుదీర్ఘగా విచారించారు. ఇవాళ ఉదయం 11.30 కి ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరైన రేవంత్ 4.30వరకు అక్కడే ఉన్నారు. 4 గంటల పాటు రేవంత్ ను ఐటీ అదికారులు విచారించారు. ఐటీ డిప్యూటీ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి, ఉదయసింహల విచారణ సాగింది. 23వ తేదీన మరోసారి విచారణకు హాజరుకావాలని రేవంత్ రెడ్డికి చెప్పారు.
ఏపీ అధికారుల ఆరా..?
ఐటీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రణదీర్ రెడ్డి ఇంటిపై ఐటీ అదికారులమంటూ దాడి చేసిన విషయాన్ని ఐటీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లానని.. వారు కూడా ఇలాంటి దాడులపై దృష్టి పెడతామని చెప్పారని రేవంత్ అన్నారు. ఐటి అధికారుల పేరుతో టాస్క్ ఫోర్స్ పోలీసులు, కేసీఆర్ ప్రైవేట్ సైన్యం దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి దాడుల వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, వీటికి భయపడి వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి విచారణ పరిణామాలపై తెలంగాణ ఐటీ కార్యాలయం వద్ద ఏపీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఐటీ కార్యాలయం వద్ద ఏపీ ఇంటలిజెన్స్ , ఎస్ బీ సమాచారం సేకరించింది.